మాజీ సీఎం కేసీఆర్ ఫ్యామిలీపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. భూదాన్ భూముల పేరుతో బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్(BRS Ex MP Vinod) కుటుంబ అక్రమాలు నిజమేనని షాకింగ్ కామెంట్స్ చేశారు. రూ.500కోట్ల భూదాన్ భూములను కేసీఆర్ కుటుంబం స్వాహా చేసిందంటూ ఆరోపించారు.
భూదాన్ భూముల స్కామ్‌పై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ఒక్క కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉపయోగపడిందని అన్నారు. ధరణి పోర్టల్ బాధితులతో సమావేశం పెడితే హైదరాబాద్‌లోని జింఖానా క్రికెట్ గ్రౌండ్ కూడా సరిపోదన్నారు.
భూములు మింగడానికే బీఆర్ఎస్.. ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చిందని ఆరోపించారు. భూదాన్ భూములపై తాను కూడా 15 రోజుల నుంచి ఆధారాలు సేకరిస్తున్నానని బండి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని కాగ్ రిపోర్ట్ ఇచ్చినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ చేయిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడమే పరిమితమైందని మండిపడ్డారు. గత రాజకీయాలు పక్కనపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని బండి స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా కాంగ్రెస్ వందరోజుల్లోపు ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెల్లరేషన్ కార్డు ఉన్నా కొందరికి పథకాల్లో కోత పెడుతున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు కుమ్మక్కై ప్రజలను మభ్యపెడుతున్నాయని ఫైర్ మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి సింగిల్‌గా 350కి పైగా సీట్లు వస్తాయని బండి జోస్యం చెప్పారు. తెలంగాణలో 17కి 17 ఎంపీ స్థానాలు బీజేపీ గెలుస్తోందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 8, 9వ తేదీన ప్రజాహిత యాత్రకు విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు. మహాశివరాత్రి పండుగ నేపథ్యంలో యాత్రకు రెండు రోజుల పాటు బ్రేక్ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.