Bengal : పశ్చిమ బెంగాల్ లోని జగన్నాథ్ పూర్ లో గల బాణాసంచా ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం పేలుడు సంభవించగా ఆరుగురు దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. మరికొందరు శిథిలాల్లో చిక్కుకుపోయారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని బారసాత్ ఆసుపత్రికి తరలించారు. ఉత్తర 24 పరగణాల జిల్లా లోని దుట్టా పుకూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని జగన్నాథ్ పూర్ లో జరిగిన ఈ ఘటనలో చుట్టుపక్కలగల ఇళ్ళు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి.
పేలుడు కారణంగా పెద్ద ఎత్తున దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా ఆవరించింది. పోలీసులు, సహాయక బృందాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేబట్టారు. మృతుల సంఖ్య పెరగవచ్చునని భయపడుతున్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం నాలుగు నెలల్లో ఇది రెండో సారి.
లోగడ తూర్పు మిడ్నపూర్ జిల్లాలో అక్రమ బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో తొమ్మిది మంది మృతి చెందారు. తాజా ఘటనలోను ఇది అక్రమ బాణాసంచా ఫ్యాక్టరీగా అనుమానిస్తున్నారు.
ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మృతుల కుటుంబాల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదం అలముకుంది.