రాష్ట్ర రాజకీయాల్లో మరో ఘట్టం తెరపైకి వచ్చింది. భద్రాచలం (Bhadrachalam) బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ( MLA Tellam Venkata Rao), సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) కలవడం ఆసక్తికరంగా మారింది. నేడు హైదరాబాద్ (Hyderabad)లోని సీఎం నివాసంలో కుటుంబసభ్యులతో సహా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెల్లం వెంకట్రావుతో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా ఉన్నారు.
మరోవైపు గతకొంతకాలంగా వెంకట్రావు కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.. ఇలాంటి సమయంలో ఆయన సీఎంను కలవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా.. దీనిపై ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంని కలిశానని పేర్కొన్నారు.
భద్రాచలం రామాలయం అభివృద్ధిపై చర్చించినట్లు వెల్లడించారు. తెలంగాణలో ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి కలపాలని కోరినట్లు తెలిపారు. అదీగాక భద్రాచలం పట్టణంలో రెండు వార్డులు ఆంధ్రాలో ఉన్నాయని.. దీని వలన నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభావం పడుతుందని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు వివరించారు. అదే విధంగా డంపింగ్ యార్డు అంశం గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ నియోకవర్గాలుండగా.. భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. గతంలో బీఆర్ఎస్ లో ఉన్న తెల్లం వెంకట్రావు అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి కాంగ్రెస్లో చేరారు. కానీ, కాంగ్రెస్లో సీటు దక్కలేదు. దీంతో బీఆర్ఎస్లో చేరి టికెల్ దక్కించుకొని విజయం సొంతం చేసుకొన్నారు..