సీఎం కేసీఆర్పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(bhatti bikramarka) సంచలన ఆరోపణలు చేశారు. రీ డిజైనింగ్ వల్లే కాళేశ్వరం(kaleshwaram) నష్టదాయకంగా మారిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి గుదిబండగా మారిందన్నారు. నాణ్యతాలోపం వల్లే మేడిగడ్డ బ్యారేజీ(Medigadda barage) వంతెన కుంగిపోయిందన్నారు.
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ అంతర్ రాష్ట్ర వంతెన శనివారం రాత్రి కుంగిపోయింది. బ్యారేజీ బీ-బ్లాక్లో 19, 20, 21వ పిల్లర్ల మధ్య ఉన్న వంతెన సుమారు 30 మీటర్ల పొడవున.. ఒక ఫీటు వరకు కిందికి కుంగింది. ఈ నేపథ్యంలో భట్టి ఆరోపణలు చేశారు.
డిజైన్లు తానే రూపొందించానన్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడరని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా ప్రశ్నించారు. గతేడాది వరదల్లో పంపు హౌసులు మునిగి భారీ నష్టం వాటిల్లిందని ఆరోపించారు.
‘కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతం అని కేసీఆర్, కేటీఆర్ పదే పదే చెప్పారు. కాళేశ్వరం ప్రపంచానికే అద్భుతమని గొప్పలు చెప్పుకొచ్చారు.. రూ.30వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారు. తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ గోదావరిలో పోశారు’ అని భట్టి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.