భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా.. అధిష్ఠానం ప్రకటించిన పంచ్ న్యాయ్ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. అలాగే బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.. గత ప్రభుత్వంలో అప్పుల పాలైన తెలంగాణను తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

అలాగే కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని భువనగిరి ఓటర్లను కోరిన రేవంత్.. బీఆర్ఎస్కు ఒక్క సీటు ఇచ్చినా అది మోడీ ఖాతాలోకి వెళ్తుందని ఆరోపించారు.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదని విమర్శించారు.. తమ ప్రభుత్వం ఉండదంటావా లాగులో తొండలు వేసి నల్గొండ బిడ్డలతో కొట్టిపిస్తానని వార్నింగ్ ఇచ్చారు..
వేల అబద్దాలు చెప్పి రూ. 7లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ వంద రోజులకే కాంగ్రెస్ను ఓడగొట్టాలని అనడం ధర్మమా అని ప్రశ్నించారు. బిడ్డకు బెయిల్ కోసం భువనగిరిలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని ఆరోపించారు. మరోవైపు రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి సోదరులు తోడైతే ఎవరూ తట్టుకోలేరని రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) వ్యాఖ్యానించారు..
భువనగిరి (Bhuvanagiri) పార్లమెంట్ సీటును గెలిపించి సీఎంకి బహుమతిగా ఇస్తామని వెల్లడించిన ఆయన.. చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించే బాధ్యత నాదేనని ప్రకటించారు. అభివృద్ధి బాధ్యత రేవంత్ రెడ్డి చూసుకుంటారు.. గెలిపించే బాధ్యత తాము తీసుకుంటామని తెలిపారు.. అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పినట్లుగా 12లో 11 స్థానాలు గెలుచుకొని చూపించామన్నారు.. కానీ సూర్యాపేట సీటు కొంచెంలో మిస్ అయిందని తెలిపారు..