మాదాపూర్ మాదక ద్రవ్యాల కేసులో హీరో నవదీప్ కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయన్ని అరెస్టు చేయవద్దంటూ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల టాలీవుడ్లో మాదాపూర్ మాదక ద్రవ్యాల కేసు కలకలం రేపింది. అగస్టు 31న గుడి మల్కాపూర్, నార్కోటిక్ పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ కేసులో మొదట ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అందించిన సమాచారం ఆధారంగా మరో 13 మందిని ఆ తర్వాత అరెస్టు చేశారు. ఇక మరికొందరు నిందితులు పరారీలో వున్నారని, వాళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టామని నార్కోటిక్ పోలీసులు వెల్లడించారు. అరెస్టు చేసిన నిందితులను కోర్టు ఎదుట హాజరు పరిచామన్నారు.
ఇది ఇలా వుంటే మాదాపూర్ మాదక ద్రవ్యాల కేసులో టాలీవుడ్ హీరో నవదీప్ కన్జ్యూమర్గా వున్నాడని నిన్న మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు ప్రసారం అయ్యాయి. నవదీప్ మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నాడని అతని స్నేహితుడు రాంచంద్ విచారణలో పోలీసులతో చెప్పినట్టు, దీంతో నవదీప్ పరారీలో వున్నట్టు వార్తలు వచ్చాయి.
ఆ వార్తలను ఖండిస్తూ హీరో నవదీప్ నిన్న ట్వీట్ చేశారు. తాను హైదరాబాద్ లో వున్నానని, ఎక్కడికి పారపోలేదని వివరణ ఇచ్చారు. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, అందు వల్ల తనను అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును నవదీప్ ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు నవదీప్ కు బిగ్ రిలీఫ్ ఇచ్చింది.