Bihar : బీహార్ లోని దర్బంగా (Darbhanga ) లో ఎయిమ్స్ ఆసుపత్రికి సంబంధించి ప్రధాని మోడీ (Modi) అబద్దాలు చెప్పారని డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) చేసిన ఆరోపణను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ (Mansukh Mandaviya) ఖండించారు. దీనిపై వీరిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో ట్వీట్ల వార్ సాగింది. దర్బంగాలో అసలు ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణమే జరగలేదని, కానీ అక్కడ ఈ హాస్పిటల్ ఉన్నట్టే మోడీ.. బెంగాల్ పంచాయతీరాజ్ పరిషద్ సమావేశాన్ని ఉద్దేశించి వర్చ్యువల్ గా చేసిన ప్రసంగంలో పేర్కొన్నారని బీహార్ ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖను కూడా చూస్తున్న తేజస్వి అన్నారు. ఈ క్రెడిట్ తమకే దక్కుతుందన్నట్టు మాట్లాడారని, ఆయన ‘పెద్ద’ అబద్ధం చెప్పారని ఆరోపించారు.
ఈ హాస్పిటల్ నిర్మాణానికి తమ ప్రభుత్వం కేంద్రానికి 151 ఎకరాలు ఇచ్చిందని, పైగా భూమిని చదును చేసేందుకు రూ. 250 కోట్లను కేటాయించిందని ఆయన తెలిపారు. కానీ దురదృష్టవశాత్తూ కేంద్రం రాజకీయాలు చేస్తూ ఈ ఆసుపత్రి నిర్మాణానికి అంగీకరించడం లేదన్నారు. ఈ దేశం ప్రధాని నుంచి వాస్తవాలు తెలుసుకోవాలని ఆశిస్తుంది.. అయితే ఆయన పచ్చి అబద్దమే చెప్పారు అని తేజస్వి యాదవ్ విమర్శించారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి మాన్సుఖ్ మాండవీయ.. ఆయనకు సుదీర్ఘంగా సమాధానమిచ్చారు.
మోడీ ప్రభుత్వం 2020 సెప్టెంబరు 19 నే అక్కడ ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి అనుమతినిచ్చిందని, కానీ మీ ప్రభుత్వం 2021 నవంబరు 3 న కొంత భూమిని కేటాయిస్తున్నట్టు పేర్కొందన్నారు, ఇందుకు సంబంధించి.. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి బీహార్ అదనపు కార్యదర్శికి నాడు పంపిన లేఖ ప్రతులను కూడా మాండవీయ తన ట్వీట్ కి జత చేశారు. ఆ తరువాత మీరే రాజకీయాలు చేస్తూ గత ఏప్రిల్ 30 న ప్రభుత్వం వద్దకు (ఢిల్లీకి) వచ్చి ఈ స్థలాన్ని మారుస్తున్నట్టు తెలిపారన్నారు. మరొక భూమిని చూపించారన్నారు.
రూల్స్ ప్రకారం నిపుణుల కమిటీ ఒకటి ఆ భూమిని తనిఖీ చేసిందన్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత మే 26 న మీ ప్రభుత్వానికి ఓ లేఖ రాసిందని, రెండో సారి ఇచ్చిన భూమి ఎయిమ్స్ నిర్మాణానికి అనువైనది కాదని స్పష్టం చేసిందని అన్నారు. ఈ లేఖ కాపీని కూడా మాండవీయ తన ట్వీట్ కి జోడించారు. భూమిని ఎందుకు మార్చారని, ఎవరి ప్రయోజనాలకోసం మార్చారని ప్రశ్నించిన ఆయన, ఎయిమ్స్ నిర్మాణానికి అనువుగా లేని భూమి గురించి బీహార్ అసెంబ్లీలో మీ సొంత ఎమ్మెల్యేనే ఏమన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల నుంచి బయటికి వచ్చి దర్బంగా లో ఆసుపత్రి నిర్మాణానికి భూమిని కేటాయించాలని, ఇందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు.