Bills : కాలం చెల్లిన బ్రిటిష్ చట్టాల స్థానే వాటికి కొత్త రూపును కల్పిస్తూ.. పేర్లను మార్చి మూడు కీలక బిల్లులను హోమ్ మంత్రి అమిత్ షా శుక్రవారం లోక్ సభలో ప్రవేశపెట్టారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానే భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానే భారతీయ సాక్ష్య బిల్లు, ఐపీసీ స్థానే భారతీయ న్యాయ సంహిత పేరిట బిల్లులను ప్రవేశపెట్టిన ఆయన.. క్రిమినల్స్ కు కఠిన శిక్షలు పడేలా ఈ బిల్లులను నిర్దేశించామన్నారు.
వేర్పాటువాద కార్యకలాపాలు, సాయుధ తిరుగుబాట్లు, భారత దేశ సార్వభౌమాధికారానికి, లేదా సమైక్యతకు భంగం కలిగించేందుకు యత్నించే వారికి, మహిళలు, పిల్లల పట్ల నేరాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు పడేందుకు సవరించిన చట్టాలు దోహదపడతాయన్నారు. చిన్నపాటి నేరాలకు కూడా మొదటిరిగా కమ్యూనిటీ సర్వీసు శిక్ష విధించేందుకు కూడా ఓ బిల్లు నిర్దేశిస్తోందన్నారు. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాలు తదితరాలకు వేర్వేరు శిక్షలు విధించడానికి ఈ బిల్లులు వీలు కల్పిస్తున్నాయి. అలాగే వేర్వేరు తరహా నేరాలకు జరిమానాలను కూడా పెంచారు.
మైనర్లపై అత్యాచార కేసుల్లో నిందితులకు మరణశిక్షలు పడేలా కొత్త బిల్లులు నిర్దేశిస్తున్నాయి. అలాగే సామూహిక అత్యాచారాలకు పాల్పడినవారికి 20 ఏళ్ళు, మూక దాడుల నిందితులకు ఏడేళ్ల పాటు జైలు శిక్షలు విధించాలని ఇవి పేర్కొంటున్నాయి. క్రిమినల్ ప్రొసీజర్ లో 313 మార్పులు చేశారు. పోలీసుల సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా వీడియోగ్రఫీ తప్పనిసరి అని ఇవి నిర్దేశించాయి. 1860 నుంచి 2023 వరకు కూడా బ్రిటిష్ వారు రూపొందించిన చట్టాలే అమలవుతూ వస్తున్నాయని, కానీ ఈ చట్టాల స్థానే క్రిమినల్ జస్టిస్ సిస్టం లో పలు మార్పులు చేశామని అమిత్ షా వివరించారు..
ఈ బిల్లులపై చర్చకోసం వీటిని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి నివేదించడం జరుగుతుందన్నారు. 1860 లో ఇండియన్ పీనల్ కోడ్, 1898 లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1872 లో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వచ్చాయని ఆయన పేర్కొన్నారు. బ్రిటిషర్లు తెచ్చిన వీటికి ఈ రోజుతో వీటికి ముగింపు పలకవలసి ఉందని ఆయన చెప్పారు. కాగా.. శుక్రవారం లోక్ సభ నిరవధికంగా వాయిదా పడింది.