Telugu News » Telangana : టార్గెట్ 10.. సంక్రాంతి తర్వాత సమరం.. ‘రాష్ట్ర’ ప్రత్యేక కథనం

Telangana : టార్గెట్ 10.. సంక్రాంతి తర్వాత సమరం.. ‘రాష్ట్ర’ ప్రత్యేక కథనం

మొత్తంగా మూడు పార్టీలు లోక్ సభ ఎన్నికల్లో 10 సీట్లకు పైనే టార్గెట్ గా పెట్టుకున్నాయి. మరి, జనం ఎవరి ఆశలు నెరవేరుస్తారో చూడాలి.

by admin

– పార్లమెంట్ ఎన్నికలపై పార్టీల సన్నాహాలు
– అత్యధిక ఎంపీ సీట్లే లక్ష్యంగా వ్యూహాలు
– రెండు రోజులపాటు బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశాలు
– సంక్రాంతి తర్వాత మరింత స్పీడ్
– కాంగ్రెస్, బీఆర్ఎస్ ను ఎలా ఎదుర్కోబోతోంది?
– ఓట్ షేర్ ను ఇంకా పెంచుకునే అంశాలేవి?
– హామీలనే నమ్ముకున్న కాంగ్రెస్
– ఇప్పుడున్న 3 సీట్లను 10కి పెంచాలని ప్లాన్
– బీఆర్ఎస్ ఆశలు నెరవేరుతాయా?
– ఉన్న 9 స్థానాల్లో గెలిచేవెన్ని..?
– సన్నాహక సమావేశాలతో ఇప్పటికే బిజీ
– జాతీయ అంశాలే ప్రధానంగా ఉండే లోక్ సభ ఎన్నికలు
– అధికారంలో లేని బీఆర్ఎస్ ప్రభావమెంత?

తెలంగాణ (Telangana) లో మరో ఎన్నికల యుద్ధం రెండు నెలల్లో జరగనుంది. అసెంబ్లీ రేస్ లో కాంగ్రెస్ (Congress) ముందు నిలవగా.. బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) వెనుకబడ్డాయి. ఇప్పుడు పార్లమెంట్ రేస్ మొదలవుతోంది. ఈ నేపథ్యంలో పార్టీల గెలుపు వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇంట్రస్టింగ్ గా మారింది. జాతీయ అంశాలు ప్రధానంగా ఉండే లోక్ సభ సమరంలో ప్రాంతీయ పార్టీల హవా తక్కువగానే ఉంటుంది. అదీగాక బీఆర్ఎస్ ఇప్పుడు ఓటమి పాలైంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ, కాంగ్రెస్ ను తట్టుకుని నిలబడుతుందా? లేదా? అనేది ఇంట్రస్టింగ్ గా మారింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఓట్ షేర్ పెంచుకున్న బీజేపీ సత్తా చాటాలని వ్యూహాల్లో ఉన్నాయి.

all parties exercise for candidates

ప్రక్షాళన దిశగా బీజేపీ

లోక్‌ సభ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ముందే అలర్ట్ అయింది. ఇప్పటికే అగ్రనేత అమిత్ షా రాష్ట్రానికి వచ్చి.. ఎలా ముందుకెళ్లాలనే దానిపై దిశానిర్దేశం చేసి వెళ్లారు. ప్రస్తుతానికి 4 స్థానాల్లో ఉన్న కమలం పార్టీని డబుల్ డిజిట్ కు తీసుకెళ్లాలని సూచించారు. మొత్తం 17 సీట్లలో కచ్చితంగా 10 సీట్లు, 35 శాతం ఓటు బ్యాంకును సాధించాలనే లక్ష్యాన్ని నిర్ధేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం గ్రామస్థాయిలో కేంద్ర పథకాల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇదే క్రమంలో ఆదివారం నుంచి రెండు రోజుల పాటు బీజేపీ ముఖ్యనేతల కీలక సమావేశం జరుగనుంది. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో రాష్ట్ర నేతలు పాల్గొననున్నారు. నేతల మధ్య వచ్చిన దూరంపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రధానంగా దృష్టి సారించింది. సమన్వయం చేసే బాధ్యతను కిషన్ రెడ్డికి అప్పగించింది. పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థులు, అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చించనున్నారు నేతలు. మెజారిటీ పార్లమెంట్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా సమావేశం జరుగనుంది. సంక్రాంతి తర్వాత కొన్ని జిల్లాల అధ్యక్షులను మార్చాలని కిషన్‌ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్య నేతల సమావేశం తర్వాత పార్టీ ప్రక్షాళనపై ఆయన ఫోకస్ పెట్టనున్నారు. ఇటు, కొందరు బీఆర్ఎస్ నేతలకు కూడా గాలం వేస్తున్నారు.

కాంగ్రెస్ గ్యారెంటీల అస్త్రం

పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారాన్ని దక్కించుకుంది కాంగ్రెస్. రాష్ట్రాన్ని తామే ఇచ్చామని ముందు నుంచీ చెప్పుకున్నా.. అది ప్రజల్లోకి వెళ్లేందుకు పదేళ్లు పట్టింది. దీనికితోడు కేసీఆర్ పాలనపై విసుగుచెందిన జనం హస్తానికి జై కొట్టారు. అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చిన సీట్లు పెద్దగా చెప్పుకోదగినవేం కాదు.. మ్యాజిక్ ఫిగర్ కు కాస్త దగ్గరలోనే ఆగింది. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలంటే ఇచ్చిన హామీలు అమలు చేస్తేనే జనం నమ్ముతారని గట్టిగా ఫిక్స్ అయింది. అందుకే, గ్యారెంటీలపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. నిజానికి, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి ఈ గ్యారెంటీలే కీలక పాత్ర పోషించాయి. దీంతో, ఇదే ఫార్మాలాను పార్లమెంట్ ఎన్నికల్లోనూ వాడాలని హస్తం పార్టీ చూస్తోంది. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే మరో మూడు గ్యారంటీలను అమలు చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించేసింది. అధకారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రచారంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితిని 10 లక్షలకు పెంపు హామీలను అమలు చేసేసింది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మరో మూడు హామీలపై దృష్టి పెట్టింది. గృహలక్ష్మి ‌పథకంలో భాగంగా ప్రతి ఇంటికీ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్, అలాగే చేయూత కింద పింఛన్లను రూ.4 వేలకు పెంపు హామీలను అమలు చేయడానికి రెడీ అవుతోంది. గ్యారెంటీలనే నమ్ముకుని ప్రస్తుతం ఉన్న 3 సీట్ల నుంచి 10 సీట్లకు పైగా సాధించాలని పట్టుదలతో కనిపిస్తోంది.

బీఆర్ఎస్ తెలంగాణ గళం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైంది బీఆర్‌ఎస్. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే జరిగితే పార్టీ మనుగడ కష్టం. దీన్ని గ్రహించిన కేసీఆర్.. సరికొత్త వ్యూహాలతో ముందుకువెళ్లాలని చూస్తున్నారు. మనమే తెలంగాణ గళం.. మనమే తెలంగాణ దళం.. మనమే తెలంగాణ బలం అన్న నినాదాన్ని అందుకున్నారు. ఈ నినాదంతో పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు నిలుపుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. జాతీయ అంశాలు కీలకంగా ఉండే లోక్ సభ ఎన్నికల్లో అధికారం లేకుండా గెలవడం కష్టం. పైగా, బీజేపీ ఓట్ షేర్ పెరిగింది. కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీలను తట్టుకుని బీఆర్ఎస్ నిలబడడం కష్టమే. ప్రస్తుతం 9 స్థానాల్లో ఉన్న గులాబీ పార్టీకి వాటిని నిలబెట్టుకోవడం కష్టంగా మారింది. ఎందుకంటే.. వీటిలోని చాలా అసెంబ్లీ నియోజకవర్గాలు కాంగ్రెస్ హస్తగతం అయ్యాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ కు గెలుపు అనేది కష్టమే. దీన్ని అధిగమించేందుకు కేసీఆర్ ఎలాంటి ఎత్తుగడులు వేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. మనమే తెలంగాణ గళం అనే నినాదం అందుకున్నా.. దాన్ని జనం ఎంత వరకు నమ్ముతారనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేసీఆర్ ఇలాంటి వ్యూహాన్ని అమలు చేసి ఫెయిల్ అయ్యారు. మొత్తంగా మూడు పార్టీలు లోక్ సభ ఎన్నికల్లో 10 సీట్లకు పైనే టార్గెట్ గా పెట్టుకున్నాయి. మరి, జనం ఎవరి ఆశలు నెరవేరుస్తారో చూడాలి.

You may also like

Leave a Comment