రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సీట్లు సాధించి ముచ్చటగా మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.. ఈ క్రమంలో బహిరంగ సభలను సైతం నిర్వహిస్తోంది. కాంగ్రెస్ టార్గెట్ గా నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ముంబై వేదికగా జరిగిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ముగింపు కార్యక్రమంలో ఇటీవల రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
ఇండియా కూటమి నేతలు హాజరైన ఈ మెగా ఈవెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. హిందూ మతంలో శక్తి అనే పదం ఉంది. మేము ఒక శక్తికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని వ్యాఖ్యలు చేశారు. శక్తి ఏంటంటే.. ఈవీఎంలో రాజుగారి ఆత్మ ఉంది. రాజు ఆత్మ ఈవీఎంలతో పాటు దేశంలోని ప్రతీ సంస్థలో ఈడీ, సీబీఐ, ఐటీలో ఉంది. ఈవీఎంలు లేకుండా ప్రధాని నరేంద్ర మోడీ (Modi) ఎన్నికల్లో గెలవలేరని విమర్శించడంతో, బీజేపీ (BJP) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీపై ఎన్నికల సంఘానికి (Election Commission) ఫిర్యాదు చేసింది. కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పురి నేడు న్యూఢిల్లీలోని భారత ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి రాహుల్ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ (Congress) ప్రజాక్షేత్రంలో అబద్ధాలు చెబుతోంది. ఒకవేళ రాహుల్‌పై చర్యలు తీసుకోకపోతే.. ఆ పార్టీ దూషణల పర్వానికి అదుపు లేకుండా పోతుందని హర్దీప్ పేర్కొన్నారు.
మరోవైపు నిన్న తమిళనాడులో పర్యటించిన మోడీ.. డీఎంకే, కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ఇక్కడున్న మధుర మీనాక్షి, కంచి కామాక్షి శక్తి స్వరూపాలని, శక్తిని ధ్వంసం చేస్తామని కాంగ్రెస్, డీఎంకే కూటమి అంటున్నాయని, హిందూ మతంలో శక్తి అంటే మాతాశక్తి, నారీ శక్తి అని ప్రధాని తెలిపారు. దైవ స్వరూపం అయిన శక్తిని ప్రతిపక్ష పార్టీలు నాశనం చేసేందుకు యత్నిస్తున్నాయని మండిపడ్డారు.. ఇది శక్తిని నాశనం చేయాలనుకునే వారికి.. శక్తిని ఆరాధించే వారికి మధ్య జరుగుతున్న పోరాటమని పేర్కొన్నారు..