ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSR Congress) పార్టీ చేపట్టిన వైనాట్ 175 క్యాంపెయిన్‌పై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నాయి. తాజాగా ఈ క్యాంపెయిన్ పై ఏపీ బీజేపీ (BJP) అధికార ప్రతినిధి భాను ప్రకాశ్ రెడ్డి (Banu Prakash Reddy) నిప్పులు చెరిగారు. వైనాట్ 175 అంటే దొంగ ఓట్ల దందానేనా? జగన్మోహన్ రెడ్డి అంటూ నిలదీశారు.
20 మంది అధికారులు, 60 మందికి పైగా సిబ్బందితో దొంగ ఓట్ల రాకెట్‌ను నిర్వహిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దొంగ ఓట్లు దందాపై సీబీఐ విచారణకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. తాను ఉన్నాను, తాను విన్నానని చెప్పారు.. అంటే దొంగ ఓట్లు ఉన్నాయని, మళ్లీ గెలుస్తా అంటే అసలు కిటుకు ఇదా జగన్ అంటూ ఎద్దేవా చేశారు.
దొంగ ఓట్లును రద్దు చేయాలని భాను ప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు.. ఏ ప్రింటింగ్ ప్రెస్‌లో ప్రింట్ చేశారనే విషయాన్ని బహిర్గతం చేయాలని నిలదీశారు. ప్రింటింగ్ ప్రెస్‌పై చర్యల తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలైన దోషులను వదలి.. కాంట్రాక్టు, కంప్యూటర్ ఆపరేట్లపై కేసు పెట్టడం సబబా? అని ప్రశ్నించారు.
ఎంపీ గురుమూర్తికి చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలన్నారు. నిన్న కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2019 తర్వాత ఏపీలో ఎన్నికలు లేవని, కేవలం ఎంపికలు మాత్రమే జరిగాయని ఆరోపించారు. ఎన్నికల్లో దౌర్జన్యాలు, నోట్ల కట్టలు వెలుగు చూశాయని చెప్పారు. వైకాపాకు అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.