ప్రమాదవశాత్తు తుంటి ఎముక విరగడంతో తెలంగాణ(Telangana) మాజీ సీఎం కేసీఆర్(Ex CM KCR) సోమాజీగూడ(Somajiguda) యశోద ఆసుపత్రి(Yashoda Hospital)లో చికిత్స పొందుతున్నారు. డాక్టర్లు తుంటి ఎముకకు సర్జరీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఇవాళ(ఆదివారం) కేసీఆర్‌ను పరామర్శించారు.
రేవంత్‌రెడ్డి యశోద ఆసుపత్రికి చేరుకోగానే మొదట మాజీ మంత్రి కేటీఆర్ కలిశారు. ఆ తర్వాత కేటీఆర్ ఆయనను లోపలికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఒకరినొకరు భుజాలను తడుముకున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని కేటీఆర్‌ను అడిగి తెలుసుకున్నారు రేవంత్. అనంతరం ఆయన ఎప్పుడు కోలుకుంటారని రేవంత్‌రెడ్డి డాక్టర్లను ఆరాతీశారు.
యశోద ఆసుపత్రిలో హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయించున్న కేసీఆర్ క్రమంగా కోలుకుంటున్నారు. శనివారం కేసీఆర్ డాక్టర్ల సమక్షంలో మెల్లిగా నడవడం ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించడం ప్రధాన్యత సంతరించుకుంది. రేవంత్‌రెడ్డి వెంట కాంగ్రెస్ నేతలు సీతక్క, షబ్బీర్ అలీ, వేం నరేందర్‌రెడ్డిలు ఉన్నారు.
కేసీఆర్‌ను పరామర్శించిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఆయన తిరిగి అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలను ప్రస్తావించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కొత్త ప్రభుత్వానికి సలహాలు, సూచనలు కావాలని కోరినట్లు వెల్లడించారు. కేసీఆర్ త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించానని రేవంత్ వెల్లడించారు.