ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో మరొక ట్విస్ట్ చోటు చేసుకొంది. మెదక్ బీఆర్ఎస్ (BRS) లోక్‌సభ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి (Venkatrami Reddy) పేరు తెరపైకి వచ్చింది.. రాధా కిషన్ రావు తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో వెంకట్రామిరెడ్డికి టాస్క్ఫోర్స్ వాహనాలలో డబ్బులు చేరవేసినట్లు తెలిపారని సమాచారం.. ఈయన నుంచి కోట్లాది రూపాయలు ఇతర అభ్యర్థులకు తమ వాహనాలలో ఇచ్చినట్లు రాధాకృష్ణ ఒప్పుకున్నారని తెలుస్తోంది.
మరోవైపు ఫోన్ టాపింగ్ కేసులో మనీలాండరింగ్ జరిగిందని అధికారులు గుర్తించారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగి అయిన వెంకట్రామిరెడ్డికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయన్నది అనుమానంగా మారిన నేపథ్యంలో.. ఆయన ఆస్తులపై పూర్తిస్థాయి విచారణ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు (Raghunandan Rao) ట్యాపింగ్ అంశంపై స్పందించారు.
రాధా కిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారం చేసుకుని ఈడి అధికారులు మనీలాండరింగ్ పై దృష్టి పెట్టి దర్యాప్తు చేయాలని సూచించారు.. అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకట్రామిరెడ్డి ఎంపీగా పోటీ చేయడానికి అనర్హుడని పేర్కొన్నారు. అలాగే తప్పుడు పనుల్లో ఉద్యోగులు భాగస్వాములు కావొద్దని హితవు పలికారు. ఎన్నికల వేళ ఉద్యోగాలను రిస్క్‌లో పెట్టుకోవద్దని సూచించిన రఘునందన్.. న్యాయపరంగా తీసుకునే చర్యల్లో ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోతారని వెల్లడించారు.
ఇదిలా ఉండగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎన్నికల ఫ్లయింగ్ స్కాడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్‌కు వ్యతిరేకంగా వెంకట్రామిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వఉద్యోగులతో సమావేశం నిర్వహించారని తెలిపారు.