తెలంగాణ రాజకీయాల్లో మూడు ప్రధాన పార్టీల మధ్య విమర్శలు తారా స్థాయికి చేరుకొంటున్నాయని అనుకొంటున్నారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఓటర్ల దృష్టిని ఆకర్శించడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొంటూ.. వారి తప్పులను బయట పెట్టుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలో బీజేపీ (BJP) మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు..
గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) టికెట్లను అమ్ముకొన్నారని ఆరోపించారు. సూట్ కేసులు ఇచ్చే వాళ్లకు టికెట్లను అమ్ముకొన్న చరిత్ర గులాబీదని విమర్శించారు.. హరీష్ రావు రాజకీయాల్లోకి రాకముందే మెదక్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ గెలిచిందని గుర్తు చేశారు.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన రఘునందన్.. కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR), కవిత, హరీష్, సంతోష్ ఈ ఐదుగురు ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.
కోళ్లు అమ్ముకునేటోల్లకు.. మందు గోలీలు తయారు చేసేటోల్లకు.. బస్సులు నడిపేటోల్లకు టికెట్.. ఇస్తారు కానీ ఎర్రోళ్ల శ్రీనివాస్ లాంటి వాళ్లకు టికెట్లు ఇవ్వరు.. అందరినీ మీ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చూస్తారు కానీ ప్రజలకు అనుకూలంగా పాలన చేయడం చేతకాదని రఘునందన్ విమర్శించారు. బీఆర్ఎస్ పేరు మార్చుకున్నప్పుడే తెలంగాణతో పేగు బంధం తెగిపోయిందని.. బీఆర్ఎస్కు ఓటు వేస్తే హుస్సేన్ సాగర్లో వేసినట్టేనని వెల్లడించారు.
త్వరలో పులి బయటకు వస్తాడని కేటీఆర్ అన్నారు.. బయటకు వచ్చేది పులి కాదు, కలుగులోకి వెళ్లాల్సిన ఎలుక అది అని రఘునందన్ రావు (Raghunandan Rao) విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్ట్ లు కేఆర్ఎంబీకి అప్పగించడంతో నష్టం జరుగుతుందని హరీష్ రావు అనడం హాస్య స్పదంగా ఉందనన్న మాజీ ఎమ్మెల్యే.. కేంద్ర జలవనరుల మంత్రి సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు 2016లో కృష్ణా జలాలపై ఒప్పందాలు చేసుకున్నారని.. ఆ సమయంలో 299 టీఎంసీలు చాలు అని కేసీఆర్ ప్రభుత్వం సంతకం పెట్టడం నిజం కాదా అని ప్రశ్నించారు..