తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ఆ పార్టీపై విమర్శలు ఎక్కువైయ్యాయని తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ (BRS) నేతలు సమయం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ పై విరుచుకుపడుతోన్నారు.. మరోవైపు బీజేపీ నేతలు కూడా చీకట్లో బాణాలు వదిలినట్టు విమర్శలు చేస్తున్నారు.. వీటన్నింటినీ ధీటుగా ఎదుర్కొంటున్న రేవంత్ ప్రభుత్వం సరైన తీరులో సమాధానాలు చెప్తుండటం కనిపిస్తోంది.
ఇక తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం పై బీజేపీ (BJP) ఎంపీ లక్ష్మణ్ (Laxman) కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఓబీసీలకు వంచించి మోసం చేసిందని ఆరోపించారు. సెమీ ఫైనల్స్ లో కాంగ్రెస్ కు చెంప పెట్టు లాంటి ఫలితాలు ప్రజలు ఇచ్చి బుద్ధి చెప్పారని తెలిపారు. రానున్న ఫైనల్స్ లో బీజేపీదే విజయం అని ధీమా వ్యక్తం చేసిన లక్ష్మణ్.. మోడీ విధానాల పట్ల ప్రజలు మొగ్గు చూపుతున్నారని అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా బీజేపీని గెలిపించడం ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నారు.
కాంగ్రెస్.. ఉత్తర, దక్షిణ అనే పేరుతో విడదీసే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించిన లక్ష్మణ్.. ఇందులో భాగంగా ద్రవిడ, ఆర్య అనే అంశాన్ని తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. కానీ బీజేపీలో దక్షిణాది పై ఎలాంటి వివక్ష లేదన్నారు. అందుకు నేనే ఉదాహరణ అని లక్ష్మణ్ వివరించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో గెలుస్తామని తెలిపిన లక్ష్మణ్.. రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగు కాబోతోందని జోస్యం చెప్పారు.