రాష్ట్రంలో మాకు ఎదురులేదు.. మేము తప్ప ఎవరు దిక్కులేదు.. ఎన్నేళ్ళు రాజకీయాలు చేసిన మేము.. మా కుటుంబం.. తెలంగాణ అభివృద్ధి మాతోనే సాధ్యం అని కన్నూ మిన్నూ కానరాక.. పోతే ఫామ్ హౌస్.. ఉంటే ప్రగతి భవన్.. అంతా మన గాలి వీస్తూంది.. పెద్ద సారు PM, చిన్న సారు సీఎం.. పక్క రాష్ట్రాలు సైతం మన ప్రభుత్వ పాలనపై ఆసక్తిగా ఉన్నాయి.. అక్కడ ఇలాంటి ప్రభుత్వం లేదని జనం బాధ పడుతోన్నారు..
ఇలా ఎన్నెన్ని పిట్ట కథలు అల్లారు.. ఎంతలా నమ్మించారు.. చివరికి ఓడిపోయిన బీఆర్ఎస్ (BRS) ముఖ్య నేతలకు ఇంకా జ్ణానోదయం కలగలేదని, ఓటమిని అంగీకరించే పరిస్థితిలో లేరని కాంగ్రెస్ (Congress) నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) విమర్శించారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. అదే అహంకారం.. అదే అహం.. ఓడిపోయి ఐదేళ్లు ఇంట్లో కూర్చునే పరిస్థితి వచ్చిన పొరలు కమ్మినా అతి విశ్వాసం విడిపోవడం లేదని మండిపడ్డారు..
ప్రజలు నమ్మి అధికారాన్ని అప్పచెబితే.. మిషన్ భగీరథ పేరుతో పెద్ద స్కాం చేశారని మండిపడ్డారు.. కాళేశ్వరం రీ డిజైన్ పెద్ద బోగస్ అని, కేవలం కమీషన్ల కోసం రీ డిజైన్ చేసారని జీవన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్‌ను, ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్‌గా మార్చి నిధులను మళ్ళించిందని.. ఆ మోసాన్ని కప్పిపుచ్చడానికి దళిత బంధు తెరపైకి తెచ్చారన్నారు.
ఎస్సీ, బీసీ, మైనారిటీ బంధుల పేరుతో ఎన్నికల ముందు హడావుడి చేసిన బీఆర్ఎస్.. తన హయాంలో గిరిజనులను నిండా ముంచిందని, అందుకే వాళ్ళు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారని అన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో కారు సారు పదహారు అంటూ కలలుగన్నారు.. అప్పుడు పట్టుమని పది సీట్లు దక్కలేదు.. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా దక్కవని జీవన రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ లో అభ్యర్థులను మార్చడం కాదని.. అధి నాయకుడిని మార్చాలని ప్రజలు డిసైడ్ అయ్యారని వ్యాఖ్యానించారు.