Telugu News » Celebration Across World : ఎక్కడ చూసినా రామ నామ స్మరణే…. ప్రపంచ వ్యాప్తంగా అంబురాన్ని అంటిన సంబురాలు….!

Celebration Across World : ఎక్కడ చూసినా రామ నామ స్మరణే…. ప్రపంచ వ్యాప్తంగా అంబురాన్ని అంటిన సంబురాలు….!

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ వేడుక సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు సంబురాలు చేసుకున్నారు

by Ramu

అయోధ్య (Ayodhya) లో ‘రామ్ లల్లా’ (Ram Lalla)ప్రాణ ప్రతిష్ట (Consecration) కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ వేడుక సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు సంబురాలు చేసుకున్నారు. పలు దేశాల్లో వీధులు రామ నామ స్మరణలతో మారుమోగి పోయాయి. పలు చోట్ల కారు ర్యాలీలు, పూజలు, భజనలు కీర్తనలతో హోరెత్తించారు. చాలా చోట్ల వేడుకలు దీపావళిని తలపించాయి. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడిాయలో వైరల్ అవుతున్నాయి.

అగ్రరాజ్యం అమెరికాలో సంబురాలు అంబరాన్ని అంటాయి. న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ ప్రాంతమంతా శ్రీ రామ నామంతో మారుమోగిపోయింది. పలు రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులు టైమ్ స్క్వేర్ ప్రాంతానికి చేరుకుని భజనలు, కీర్తనలతో ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. అక్కడ ఎలక్ట్రిక్ బిల్ బోర్డుపై రాముడి చిత్రాలను ప్రదర్శించారు. రామ మందిర ప్రారంభోత్సవం సందర్బంగా మసాచు సెట్స్‌లోని వొర్సెస్టర్ నగర్ మేయర్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.

 

శాన్‌ఫ్రాన్సిస్కోలో అమెరికాలోని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సభ్యులు గోల్డెన్ గేట్ బ్రిడ్జి వద్ద కారు ర్యాలీ నిర్వహించారు. న్యూజెర్సీలోని సిద్ధి వినాయకుని ఆలయంలో కూడా భక్తులు పూజలు చేశారు. ప్రవాసీ భారతీయులతో కలిసి వీహెచ్‌పీ నేతలు అమెరికా వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 40కి పైగా బిల్ బోర్డులను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

 

బ్రిటన్‌లో సంబురాలు :

రామ మందిర ప్రారంభోత్సవం సందర్బంగా లండన్‌లో పెద్ద ఎత్తున హిందువులు ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్బంగా పలు ఆలయాల్లో బ్రహ్మర్షి మిషన్ ఆశ్రమం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దేశంలో ఉన్న సుమారు 250కి పైగా ఆలయాలను ఈ సందర్బంగా పుష్పాలతో సుందరంగా అలంకరించారు. పలు ప్రాంతాల్లో కారు ర్యాలీలు, ప్రత్యేక హారతి, అఖండ రామాయణ శ్రవణం వంటి కార్యక్రమాలను నిర్వహించారు.

 

ట్రిడినాడ్ అండ్ టొబాగో :
ట్రినిడాడ్ టొబాగోలోని రామ జన్మభూమి స్థాపన సమితి, ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ రామ్ మందిర్, ప్రవాసీ భారతీయుల సహకారంతో సంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. సుమారు 5,000 మంది వరకు ప్రవాసీ భారతీయులు కార్యక్రమానికి హాజరయ్యారు. రాముని పాటలతో ఆ ప్రాంత మంతా మారుమోగిపోయింది. ఈ సందర్బంగా 5000 దీపాలను వెలిగించారు.

నేపాల్ లో :
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా నేపాల్‌లోనూ అనేక కార్యక్రమాలను నిర్వహించారు. సీతా దేవీ జన్మస్థలమైన జానక్ పూర్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. ఉదయం నుంచి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాత్రి సమయంలో ఆలయం విద్యుద్దీపాలతో అత్యంత సుందరంగా వెలిగిపోతోంది.

మెక్సికో :
మెక్సికోలోని క్వెరెటారో అనే నగరంలో శ్రీరాముని ఆలయాన్ని ప్రారంభించారు. విగ్రహాలను భారత్ నుంచి తీసుకు వచ్చారు. ఆలయంలో ‘ప్రాణ-ప్రతిష్ఠ’ వేడుకను ఒక అమెరికన్ పూజారి నిర్వహించారు. ప్రవాసీ భారతీయల భజనలు, సంకీర్తనల మధ్య ఆలయం అంతా ప్రతిధ్వనించాయి. ఈ సందర్బంగా రామాయణ శ్రవణం నిర్వహించారు.

ఆస్ట్రేలియా :

ఆస్ట్రేలియాలోని వందలాది ఆలయాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. సిడ్నీలో ప్రవాస భారతీయులు కార్ల ర్యాలీని నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. వందలాది కార్లు ర్యాలీలో పాల్గొన్నాయి. ప్రాణ ప్రతిష్ట సందర్బంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు ఆలయాల్లో దేవుని దర్శనం చేసుకున్నారు.

మారిషస్ :

మారిషస్‌లోని ప్రవాసీ భారతీయులు రామ్ లల్లా పవిత్రోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. దేశంలోని అనేక దేవాలయాల్లో భక్తులు ‘‘దీపాలు’ వెలిగించి ‘రామాయణ పథం’ నిర్వహించారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట సందర్బంగా దేశ వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సవాలు జరుపుకోవాలని మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ కుమార్‌ జుగ్‌నాథ్‌ పిలుపునిచ్చారు.

ఫిజిలో :
ఫిజిలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట సందర్బంగా గత నాలుగు రోజులుగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. రాజధాని సువాలోని ఇండియన్ కౌన్సిల్ ఫర్ రిలేషన్స్, సనాతన్ ధర్మ ప్రతినిధి సభ ఆధ్వర్యంలో 18 నుంచి 22 వరకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రవాసీ భారతీయులు హాజరవుతున్నారు.

ఫ్రాన్స్‌లో :

రామ మందిర ప్రారంభోత్సవం సందర్బంగా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో రథయాత్రను నిర్వహించారు. డీ లా చాపెల్లా ప్రాంతం నుంచి ఈ రథయాత్ర ప్రారంభం అయింది. ఈపిల్ టవర్‌తో పాటు పలు చారిత్రక ప్రాంతాల గుండా ఈ యాత్ర సాగింది. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. విశ్వ కళ్యాణ్ యజ్ఞ, పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

You may also like

Leave a Comment