నాంపల్లి(Nampally) రైల్వే స్టేషన్(Railway Station)లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్‌లోని ప్లాట్ ఫారం సైడ్‌వాల్‌కు ఢీకొట్టడంతో ఒకరు మృతిచెందగా 50 మందికి గాయాలయ్యాయి. చెన్నెనుంచి నాంపల్లి రైల్వే స్టేషన్‌కు వస్తుండగా కాసేపటి క్రితమే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
దీంతో వెంటనే రైల్వే శాఖ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్లాట్ఫారం సైడ్ వాల్‌ను ఢీకొట్టడంపై రైల్వే అధికారులు విచారణ చేస్తామని చెప్పారు. అసలు సైడ్ వాల్‌కు ఎలా ఢీకొట్టింది? అనే దానిపై రైల్వే అధికారులు విచారణ చేయనున్నారు. గాయపడిన 50 మంది ప్రయాణికులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
నాంపల్లి రైల్వే స్టేషన్లో ఈ ప్రమాదం జరగడంతో మిగిలిన రైళ్ల రాకపోకలకు ఆలస్యమవుతోంది. ప్రమాద సమయంలో రైళ్లో వందల సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఒకరు గుండెపోటుతో మృతిచెందాడని, మరికొంత మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు.
ఈ ఘటనపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. పట్టాలు చిన్నగా పక్కకి ఒరగడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. ఘటనకు గల కారణాలపై అధికారులను పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు. వెంటనే జిల్లా యంత్రంగా అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గాయపడిన ప్రయాణికులకు సరైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.