ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీల(Six Guarantees) అమలుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు మంత్రివర్గ ఉప సంఘంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. బుధవారం జరిగిన కోస్గి సభలో సీఎం రేవంత్‌రెడ్డి వరాల జల్లు కురిపించిన విషయం తెలిసిందే.
వారం రోజుల్లో రూ.500లకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్(Free Current) పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఆరు గ్యారంటీల్లో నాలుగు గ్యారంటీలను అమలు చేశామని, వచ్చే నెల 15లోపు రైతుబంధు, రైతుభరోసా పథకాలను అమలు చేస్తామన్నారు. ఒక్క రైతు కూడా బకాయి లేకుండా రైతుభరోసా అందిస్తామన్నారు.
త్వరలోనే రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని తెలిపారు. ఈ మేరకు నేడు కేబినెట్ సబ్ కమిటీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను డిస్కంల ద్వారానే అమలు చేయాలని భావిస్తుండగా, సిలిండర్‌ను గ్యాస్ ఏజెన్సీల ద్వారానే ముందుకెళ్లేలా లేదా మరేదైనా ప్రత్యామ్నాయం ఆలోచించి లబ్ధిదారులకు అందించాలా అనే అంశాలపై చర్చిస్తున్నారు. అదేవిధంగా పురపాలక, ఆర్డబ్యూఎస్ విభాగాలతోనూ సీఎం సమావేశం కానున్నారు. మంచినీటి సరఫరా, రిజర్వాయర్లలో నీటి నిల్వలపై అధికారులతో సీఎం చర్చించనున్నారు.