Telugu News » Lok Sabha elections : రాష్ట్రంలో మోడీ-రామ మందిరం అనే బ్రహ్మస్త్రాలు బీజేపీకి మైలేజీ ఇస్తాయా..?

Lok Sabha elections : రాష్ట్రంలో మోడీ-రామ మందిరం అనే బ్రహ్మస్త్రాలు బీజేపీకి మైలేజీ ఇస్తాయా..?

ఈమేరకు తెలంగాణలో పది ఎంపీ సీట్లు సాధించాలనే పట్టుదలతో బీజేపీ నేతలు ఉన్నారు. కానీ రాష్ట్రంలో బీజేపీ ఆశించినట్లుగా విజయం అందుకోంటుందా అనే అనుమానాలున్నాయి.

by Venu
Election Results LIVE Updates

తెలంగాణ (Telangana)లో పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) కోసం బీజేపీ (BJP) పక్కా ప్రణాళికతో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో మొత్తం నియోజక వర్గాలను ఐదు క్లస్టర్లుగా విభజించుకొని విజయసంకల్ప యాత్రను మొదలుపెట్టింది. కలిసి కదులుదాం.. మరోసారి మోడీని గెలిపిద్దాం అనే నినాదాన్ని ముందుంచి.. 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మార్చి నెల 2వతేదీ వరకు అంటే 12 రోజులపాటు 4,238 కిలోమీటర్ల దూరం సాగాలని లక్ష్యంగా నిర్ణయించుకొంది.

ఈమేరకు తెలంగాణలో పది ఎంపీ సీట్లు సాధించాలనే పట్టుదలతో బీజేపీ నేతలు ఉన్నారు. కానీ రాష్ట్రంలో బీజేపీ ఆశించినట్లుగా విజయం అందుకోంటుందా అనే అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో నరేంద్రమోడీ (Narendra Modi) క్రేజ్, రామ మందిరం నిర్మాణం ద్వారా రాజకీయ మైలేజీ పెరిగే అవకాశం ఉందనే ధీమాలో కమలం నేతలున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదీగాక ఐదు దశాబ్దాల అయోధ్య (Ayodhya) రామమందిరం కలను సాకారం చేసిన మోదీ సందేశంతో పాటు, గత పదేళ్లలో కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఈ యాత్రలో ప్రచారం చేస్తున్నారు.

ఇదంతా పక్కనపెడితే.. తెలంగాణలో జీరో స్థానం నుంచి తాజాగా జరిగిన ఎన్నికల వరకు బీజేపీ ప్రస్థానంలో జరిగిన మార్పులపై విశ్లేషణ చేసుకొన్న అధిష్టానం.. కాషాయానికి ఇక్కడ గ్రోత్ ఉందని.. ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఆదరిస్తారనే విశ్వాసాన్ని వెల్లడిస్తుంది. ఇందుకు నిదర్శనంగా 2019 పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ నాలుగు సీట్లను గెల్చుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లను కైవసం చేసుకొంది.

ఇలా విజయవకాశాలను జల్లేడపట్టిన బీజేపీ.. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో 10 స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు రచించిన వ్యూహంలో భాగంగా ఐదు విజయ సంకల్ప యాత్రలు చేపట్టిందని తెలుస్తోంది. అయితే పొత్తులు లేకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకొన్న అధిష్టానం నిర్ణయంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎలాగో కారు పార్టీ స్టీరింగ్ జామ్ అయ్యింది. ప్రస్తుతం ఫామ్ లో ఉన్న కాంగ్రెస్ కూడా విజయం కోసం గట్టి ప్రయత్నాల్లో ఉంది.

ఇదే సమయంలో రాష్ట్రంలో హిందూ సెంటిమెంట్ బీజేపీకి కలిసి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. రామ మందిరం నిర్మాణం.. రాజకీయం వేరు వేరనే భావనలో జనం ఉన్నట్లు రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. అందులో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో అభిమానం ఉన్న విషయాన్ని పరిగణలోకి తీసుకొంటే.. ప్రభుత్వం ఏర్పడి కనీసం సంవత్సరం కూడా కాలేదు.

అప్పుడే ప్రజలు తమ అభిప్రాయాన్ని మార్చుకొని బీజేపీ వైపు మారుతారనేది సాధ్యపడకపోవచ్చని అనుకొంటున్నారు. మోడీ, రామ మందిరం అనేవి ప్రస్తుతం బ్రహ్మస్త్రాలు కావని అంటున్నారు. కానీ ఓటర్ల మనోగతం గుర్తించడం కష్టంఅని ఇదివరకే నిరూపించారు. అందుకే పార్లమెంట్ పోరులో బీజేపీ హవా ఏమేరకు ఉంటుందో అనే ఆసక్తి ఇక్కడి రాజకీయాల్లో నెలకొంది.

You may also like

Leave a Comment