గత ప్రభుత్వ హయాంలో తీవ్ర విమర్శలు ఎదుర్కోన్న టీఎస్పీఎస్సీ (TSPSC) వల్ల ఎందరో నిరుద్యోగులు నష్టపోయారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలని భావించిన రేవంత్ సర్కార్.. ఆ దిశగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఛైర్మన్‌తో పాటు ముగ్గురు సభ్యుల రాజీనామాల్ని గవర్నర్ ఆమోదించడంతో కొత్త బోర్డు ఏర్పాటు కానుంది.
టీఎస్పీఎస్సీలో ఛైర్మన్‌తో పాటు పూర్తిస్థాయిలో సభ్యులను నియమించాలని భావిస్తోన్న ప్రభుత్వం.. ఇప్పటికే కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రొఫెసర్ల పేర్లను పరిశీలిస్తోంది. వీలైనంత త్వరగా ఛైర్మన్‌తో పాటు సభ్యుల్ని నియమించే ఆలోచనలో రేవంత్ సర్కార్ (CM Revanth Reddy) ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల నిర్వహణ విషయంలో టీఎస్పీఎస్సీ అపవాదు మూటగట్టుకోంది.
ఈ క్రమంలో నిరుద్యోగులు కొత్త బోర్డు (New Board) ఏర్పాటు చేసిన తరువాతే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువుదీరడంతో కమిషన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని భావించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. ఛైర్మన్‌తో పాటు పూర్తిస్థాయిలో సభ్యులను నియమించాలని నిర్ణయించింది.. ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న మెరుగైన విధానాల్ని అధ్యయనం చేసేందుకు ఉన్నతాధికారుల బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఇప్పటికే కేరళ పీఎస్సీని ఈ బృందం అధ్యయనం చేసింది. స్వయంగా ముఖ్యమంత్రి, రాష్ట్ర అధికారులతో యూపీఎస్సీ (UPSC) ఛైర్మన్‌ను కలిసి పోటీ పరీక్షల నిర్వహణ పారదర్శకంగా చేపట్టేందుకు సూచనలు కోరారు. అధ్యయన నివేదిక వచ్చిన తర్వాత కమిషన్‌లో పలు మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈమేరకు టీఎస్పీఎస్సీ నూతన బోర్డు ఏర్పాటైన తరువాత ఉద్యోగాల నియామక ప్రక్రియలో కదలిక రానుందని సమాచారం..