– టానిక్ ఎలైట్ షాపుల్లో జీఎస్టీ అధికారుల సోదాలు
– అనుబంధ 11 ‘క్యూ’ షాపుల్లోనూ తనిఖీలు
– ‘వ్యాట్’ ఎగవేత కోణంలో దర్యాప్తు
– వెలుగులోకి కొత్త విషయాలు
– బీఆర్ఎస్ హయాంలో రూల్స్ కు విరుద్ధంగా అనుమతులు
హైదరాబాద్ మహానగరంలో గత రెండు రోజుల నుంచి జీఎస్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తమ లిస్టులో ఉన్న కంపెనీలపై దాడులు చేస్తూ వాటి బాగోతాలన్నీ బయటపెడుతున్నారు. ఈ క్రమంలోనే టానిక్ మద్యం షాప్ లో అక్రమాలు వెలుగుచూశాయి. ఏ మద్యం షాప్ కు లేని వేసులుబాటు టానిక్ కు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో ఏ4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ అయింది. రాష్ట్రంలో ఎక్కడా లేని ఎలైట్ అనుమతులు కేవలం టానిక్ కు మాత్రమే గత ప్రభుత్వంలో అధికారులు కట్టబెట్టారు. దీనికి భారీగా ముడుపులు చేతులు మారినట్టు అనుమానిస్తున్నారు.
ఇదంతా ఎక్సైజ్ పాలసీకి పూర్తి విరుద్ధం. ముందుగా పాలసీలో అనుమతి నోటిఫై చేయలేదని పలువురు వైన్ షాప్ నిర్వాహకులు వాదిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో టానిక్ కు 11 ఫ్రాంచైజ్ లు ఉన్నాయి. క్యూ బై టానిక్ పేరుతో మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. ఏ షాప్ కు లేని ప్రత్యేక అనుమతులు దీనికే ఎందుకు ఉన్నాయని ఆరా తీస్తున్నారు. ఈ 11 క్యూ టానిక్ సిండికేట్లను అనిత్ రెడ్డి, అఖిల్ రెడ్డి నడుపుతున్నారు.
ఈ లిక్కర్ గ్రూప్ సిండికేట్ కు సంబంధించి బోడుప్పల్, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంచైజీలలో ముగ్గురు ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎంవో అధికారి భూపాల్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి, ఎక్సైజ్ ఉన్నతాధికారి కూతురు, మరో అడిషనల్ ఎస్పీ కూతురు ప్రియాంక రెడ్డిల ప్రమేయం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. టానిక్కు రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా, ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచైనా రకరకాల మద్యం బ్రాండ్లను తెప్పించుకునే వెసులుబాటు ఉందని ఎక్సైజ్ అధికారులు వివరిస్తున్నారు.
సాధారణంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మద్యంపై 70 శాతం మేర వ్యాట్‌ను విధిస్తుంది. ఆల్కహాల్ లేని సోడాలు, ఇతర మిక్సింగ్ డ్రింకులు, కొన్ని రకాల ఆహార పదార్థాలకు జీఎస్టీ చెల్లించాల్సి ఉంది. ఈ చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని ఆరా తీస్తున్నారు అధికారులు. టానిక్ యజమానులు నగరంలోని కొన్ని మద్యం షాపులకు ఫ్రాంచైజీ ఇస్తున్నారు. ఇలాంటి షాపులకే ‘క్యూ బై టానిక్’ అని పేరు పెట్టి మద్యాన్ని విక్రయిస్తున్నారు. ఈ క్యూ షాపులు నగరంలోని హైటెక్ సిటీ, కూకట్పల్లి, బోయినపల్లి, ఎల్బీ నగర్, ఉప్పల్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు వంటి 11 చోట్ల ఉన్నాయి. వీటిలో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. టానిక్ యజమానులు బీఆర్ఎస్ పార్టీ పెద్దలకు సన్నిహితులు కావడంతోనే అనుమతులు ఇచ్చారంటూ అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి.