కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆగం అయిందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka). ఖమ్మం (Khammam) జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ (Congress) అగ్ర నాయకులు అందరూ సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరవుతారని తెలిపారు. ఈ మీటింగ్ తరువాత 17న హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ ఉంటుందని చెప్పారు.
తెలంగాణ (Telangana) అనేక సమస్యలతో అట్టుడికిపోతోందన్నారు భట్టి. రాష్ట్రం 86 శాతం బడుగు బలహీన వర్గాలతో నిండి ఉందని.. కానీ, వనరులు అన్నీ దొరల చేతుల్లోకి వెళ్లిపోయాయని ఆరోపించారు. రాష్ట్రం కొంతమంది బీఆర్ఎస్ నాయకుల చేతుల్లో ఉందని విమర్శించారు.
సోనియాగాంధీ (Sonia Gandhi) ద్వారా చారిత్రాత్మక డిక్లరేషన్లను ప్రకటించబోతున్నట్టు తెలిపారు భట్టి విక్రమార్క. ఐదు నియోజకవర్గాలకు ఒక ఇంఛార్జిని నియమించడం జరుగుతుందని.. హైదరాబాద్ బహిరంగ సభ అయిపోయిన తర్వాత 18న సీడబ్ల్యూసీ నాయకులు 119 నియోజకవర్గాల్లో పర్యటిస్తారని తెలిపారు. 18 నుండి ప్రతి ఇంటికి వెళ్ళి గ్యారెంటీ కార్డులు ఇస్తారని వివరించారు భట్టి.
రానున్న ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పదికి పది సీట్లను కాంగ్రెస్ పార్టీ గెల్చుకుంటుందని.. బీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో పలువురు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తితో ఉన్నారన్నారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని తెలిపారు. మంత్రిగా మాటలు చెబుతున్న పువ్వాడ అజయ్ తొలుత గెలిచింది కూడా కాంగ్రెస్ నుంచేనని, ఆనాడు పొంగులేటి గెలిపించింది కూడా వైఎస్ అభిమానులేనని గుర్తు చేశారు భట్టి విక్రమార్క.