రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి. ఏప్రిల్ చివరి నెల నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి జోరందుకోనుంది. ఎక్కడా చూసినా పార్టీల ప్రచార హోరు, టీవీ డిబెట్ల వేదికగా ఆయా పార్టీల నేతల మాటల యుద్దాలు, రాజకీయ తంత్రాలు, పొలిటికల్ అస్త్రాలను సంధించడం ఇవే కనిపిస్తుంటాయి. రాష్ట్రంలో ఇప్పటికే బీజేపీ ప్రచార హోరు స్పీడ్ అప్ చేయగా.. కాంగ్రెస్ అభ్యర్థులను ఫైనల్ చేయడంలోనే ఇంకా తర్జనభర్జన పడుతోంది.
ఇక బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో తన ఉనికిని కాపాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నం చేస్తోంది. కేసీఆర్(KCR) ఇప్పటికే జిల్లాల పర్యటనకు ముహూర్తం ఫిక్స్ చేశారు. నల్గొండ, కరీంనగర్ జిల్లాల పర్యటన సందర్భంగా రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల(Farmers Suicides)పై ఆయన గళం విప్పారు. తెలంగాణలో సమృద్ధిగా నీరున్నా చేతగానీ దద్దమ్మల పాలనలో కరువును చూస్తున్నామని ఫైర్ అయ్యారు.
అందుకే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రైతుల ఆత్మహత్యలు, కరువు ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లి అధికార పార్టీని ముప్పుతిప్పలు పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ యోచిస్తోంది. తాజాగా ఆ పార్టీ రైతు ఆత్మహత్యలపై చేసిన ఓ పోస్టు సంచలనంగా మారింది. కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చిన 120 రోజుల్లోనే ఏకంగా 220 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని, దానికి సంబంధించిన ఓ న్యూస్ పేపర్ క్లిప్‌ను సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్(X)లో పోస్టు చేసింది.
‘కేసీఆర్ పాలనలో పచ్చని పంటలతో కళకళలాడిన తెలంగాణ నేడు రైతుల ఆత్మహత్యలతో వెలవెలబోతోంది.బంగారం లాంటి పంటను మార్కెట్‌కు పంపించి.. వచ్చిన డబ్బులతో రైతన్న సంతోషంగా ఉండాల్సిన సమయం ఇది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో అదే పంటను చూసి కన్నీళ్లు కార్చాల్సిన దుస్థితి వచ్చింది. నీళ్లో రామచంద్రా అని ఎంత వేడుకున్నా కాంగ్రెస్ పాలకులు చుక్క నీళ్లు ఇస్తలేరు. ఏడ్చి ఏడ్చి అన్నదాతల కళ్లలో నీళ్లు కూడా ఇంకిపోయాయి. ఇక మిగిలింది తమ గొంతులో ప్రాణమొక్కటేనని దానిని కూడా వదిలేస్తున్నారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోని జిల్లా, కరెంటు కోతలు లేని జిల్లాలే కాదు.. రైతు ఆత్మహత్యలు లేని జిల్లాలు కూడా లేవు’ అని బీఆర్ఎస్ పార్టీ స్పందించింది.
కేసీఆర్ పాలనలో పచ్చని పంటలతో కళకళలాడిన తెలంగాణ నేడు రైతుల ఆత్మహత్యలతో వెలవెలబోతోంది. బంగారం లాంటి పంటను మార్కెట్ కు పంపించి.. వచ్చిన డబ్బులతో రైతన్న సంతోషంగా ఉండాల్సిన సమయం ఇది.
కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో అదే పంటను చూసి కన్నీళ్లు కార్చాల్సిన దుస్థితి వచ్చింది.
నీళ్లో… pic.twitter.com/mekwXFky2I
— BRS Party (@BRSparty) April 11, 2024