ఏపీ సీఎం జగన్ (Jagan) లో భయం కనిపిస్తోందని అన్నారు సీపీఐ నేత నారాయణ (Narayana). ఎన్నికల్లో సాయం కోసమే జగన్.. కేసీఆర్ (KCR) దగ్గరకి వెళ్లారని చెప్పారు. ఆయనను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాలని ప్రయత్నించి జగన్ విఫలమయ్యారని.. పోలింగ్ రోజు నాగార్జునసాగర్ లో లేని గొడవ సృష్టించి ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. పొత్తు పేరుతో చంద్రబాబును బీజేపీ నష్టపరచాలని చూస్తోందని అన్నారు. తమను ప్రశ్నించిన వారిని కేంద్రం 17ఏ పేరుతో బెదిరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, జగన్ ను కూడా 17ఏతో బీజేపీ భయపెట్టిస్తోందని వ్యాఖ్యానించారు.
ఇంట్లో కుంపటి వ్యాఖ్యలు చేసి.. జగన్ తన ఓటమిని ఒప్పుకున్నారన్నారు నారాయణ. తన ఇంట్లో తానే జగన్ గొడవ సృష్టించుకుని ఇతరులను నిందిస్తున్నారని చెప్పారు. చెల్లిని, బాబాయ్ ని దూరం చేసుకున్నారని.. అధికారానికి కూడా దూరమవుతారని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లెక్కనే.. జగన్ పోవాలి అని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో.. సీపీఐ, సీపీఎం కలిసి పని చేయాలని అనుకున్నామన్నారు. నిచ్చితార్థం అయ్యింది కానీ.. పెళ్లి దగ్గర ఆగిపోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇక, రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం వచ్చిందని.. కానీ, వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చారు నారాయణ. ఉద్దేశపూర్వకంగా అద్వానీని రామ మందిరం ప్రారంభోత్సవానికి రావొద్దని చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ గ్రాఫ్ తగ్గ కూడదని.. అద్వానీని పిలవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ మీద ఈగ వాలినా.. మోడీ, అమిత్ షా కి నష్టమని విమర్శించారు. కాబట్టి ఆయన్ని కాపాడే పనిలో ఉన్నారని అన్నారు.
ప్రధానిగా మోడీ మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనకూడదని… కానీ ఆయన వెళ్తున్నారని ఆరోపించారు. రాబోయే లోక్ సభ ఎన్నికల కోసమే రామ మందిర నిర్మాణమని ఆరోపించారు. కేవలం కాంగ్రెస్ తప్పిదాల వల్లే మూడు రాష్ట్రాల్లో ఆ పార్టీ ఓడిపోయి.. బీజేపీ గెలిచిందన్నారు. పార్లమెంట్ పై దాడి జరిగితే సమాధానం చెప్పలేక ఎంపీలను సస్పెండ్ చేశారని విమర్శించారు. దేశంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయని.. ఇండియా కూటమి బలపడుతోందన్నారు నారాయణ.