గణనాధుడి పండగంటే (Vinayaka Chavithi) సరదా పండుగ. అందుకే గణేషుడిని వివిధ రూపాల్లో ప్రతిష్ట చేస్తుంటారు. అలాగే పలు చోట్ల గణనాథుడిపై భక్తులు వినూత్న రీతిలో తమ భక్తిని చాటుకుంటున్నారు. కొందరు గణేషుడిని సినిమా యాక్టర్లు (Cine Actors), రాజకీయ నాయకులు (Politicians), పాపులర్ స్టార్లు రూపాల్లో తయారు చేసే విగ్రహాలను తయారు చేస్తుంటారు. ఇంకొందరు మండపాలను వినూత్నంగతా అలంకరిస్తుంటారు.
ఇలా తమ గణేశుడు వినూత్నంగా ఉండేలా చూసుకునేవారు కొందరైతే.. వినాయక మండపాన్ని సరికొత్తగా అలంకరించుకునే వాళ్లు మరికొందరుంటారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని శ్రీ సత్య గణపతి ఆలయ నిర్వాహకులు ఈ ఏడాది తమ ఆలయాన్ని వినూత్న రీతిలో అలంకరించారు.
ఆలయాన్ని వందల కొద్ది నాణేలు, కరెన్సీ నోట్లతో అలంకరించారు. వాటి విలువ ఏకంగా రూ.65 లక్షలు. అందులో రూ.10 నుంచి రూ.500 వరకు నోట్లు ఉన్నాయి. వివిధ ఆకృతుల్లో ప్రత్యేకంగా ఆలయాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ డబ్బంతా కూడా కొందరు భక్తలు ఇచ్చినది కొంత కాగా, మరి కొంత ఆలయ నిర్వాహకులు సేకరించింది. ఉత్సవాలు ముగిసిన తర్వాత ఈ సొమ్మును మళ్లీ ఎవరిది వారికి ఇచ్చేస్తారు. వినాయక ఆలయాన్ని అలంకరించిన ఈ డబ్బు తమ వద్ద ఉంటే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. దాంతో అలంకరణకు తమ డబ్బును ఇచ్చామని భక్తులు చెప్పారు.
గత కొన్నేళ్లుగా గణేశ్ నవరాత్రులకు ఆలయాన్ని పర్యావరణ హితంగా అలంకరిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా పూలు, మొక్కజొన్న, అరటి కాయల, వివిధ రకాల పండ్లను ఉపయోగిస్తున్నారు. ఈసారీ అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆలయ అలంకరణకు కరెన్సీ నోట్లను వినియోగించారు.