ప్రస్తుతం దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోన్న అంశం అయోధ్య రామ మందిరం.. ఈ విషయాన్ని గ్రహించిన సైబర్ నేరగాళ్లు (Cyber criminals) సరికొత్త పథకాన్ని రచించారు. భక్తిలో ఉన్న ప్రజలను బలి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయోధ్య రామమందిర కార్యక్రమాల పేరుతో వాట్సాప్ వేదికగా.. స్పామ్ నెంబర్ల నుంచి రామ్ జన్మభూమి గృహ్ సంపర్క్ అభియాన్ యాప్ లింకును పంపుతున్నారు.
వీఐపీ లాంజ్‌లో కూర్చుని అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం చూడొచ్చని ఫేక్ యాప్‌లతో వల విసురుతున్నారు. అతి ఉత్సాహంతో వాటిని క్లిక్ చేయగానే వ్యక్తిగత డేటాతో పాటు బ్యాంక్ ఖాతా వివరాలు నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోవడం, భయంకర వైరస్లు మన డివైజ్‌లోకి వచ్చేయడం అంతా చకచకా జరిగిపోతుందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా 3 నెలల వ్యాలిడిటీతో రూ.749 విలువ చేసే రీఛార్జ్ చేస్తున్నారని నకిలీ లింక్‌లు కూడా వాట్సాప్ వేదికగా వైరల్ అవుతున్నాయి.
ఈ లింకులు నిజమే అని నమ్మేలా ఆకర్షణీయంగా ఉండటంతో ప్రజలు వీటి బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.. ఒకవేళ ఏదైనా తెలియని కొత్త లింక్ వచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు పరిశీలించి.. అవసరం అనుకొంటేనే క్లిక్ చేయాలని, లేదంటే డిలెట్ చేయాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.. మరోవైపు అయోధ్య (Ayodhya)లో రామమందిరం (Ram Mandir) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.
జనవరి 22వ తేదీన రామాలయంలోని గర్భగుడిలో రాంలల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ క్రమంలో ఆహ్వానపత్రిక ఉన్న వారికే అనుమతి ఉంటుందని, ఆహ్వానం లేని వారిని అనుమతించడం లేదని ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వం ప్రకటించింది. దేశ ప్రధాని సహా కేంద్రమంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ముఖ్య నేతలు హాజరవుతోన్న దృష్ట్యా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసింది.