వన్యప్రాణులను చంపడం నేరంగా పరిగణిస్తారు అధికారులు. అందులో చిరుత (Leopard), పులి (Tiger) వంటి వాటిని హత్యమార్చి వాటి చర్మాన్ని విక్రయించడం అప్పుడప్పుడు కనిపిస్తుంది.. ఇలా చేసే వారిపట్ల అటవీ శాఖ (Forest Department) అధికారులు కఠినంగా వ్యవహరించిన సందర్భాలు సైతం ఉన్నాయి.. కాగా కొన్ని చోట్ల కొందరు వేటగాళ్లు అడవి జంతువుల కోసం తరచు వలలు వేస్తుంటారు.
ఇలా వేసిన వలలో అప్పుడప్పుడు క్రూర మృగాలు సైతం చిక్కుకోవడం తెలిసిందే.. అలా చిక్కుకొన్న జంతువులను చంపి.. ఆపై కళేబరాన్ని మాయం చేయాలనే ఉద్దేశంతో వాటిని వేటగాళ్లు దహనం చేస్తుంటారు. ఇలాంటి సంఘటనే ఇటీవల ఒకటి చోటు చేసుకొంది. అటవీ జంతువుల కోసం వేటగాళ్లు పెట్టిన వలలో పడి చిరుత మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దౌల్తాబాద్ (Daulatabad), చేగుంట (Chegunta) సరిహద్దు ప్రాంతంలోని అడవిలో వేటకు వెళ్లిన పలువురు అడవి జంతువుల కోసం ఏర్పాటు చేసిన వలలో చిరుత చిక్కింది. అనంతరం ఆ వేటగాళ్లు చిరుతను కర్రలతో కొట్టి చంపి కళేబరాన్ని దహనం చేశారు. చర్మాన్ని ఒలిచారు.. మరోవైపు ఈ విషయం కాస్త బహిరంగ చర్చగా మారడంతో.. అదికాస్త అధికారుల దృష్టికి వెళ్ళింది..
దీంతో ఫారెస్ట్ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. చిరుత చర్మ ఏం చేశారు అనే దానిపై ఆరా తీస్తున్నట్లు సమాచారం..