Telugu News » Delhi : బోరుబావిలో పడిన చిన్నారి.. కొనసాగుతున్న సహాయక చర్యలు..!

Delhi : బోరుబావిలో పడిన చిన్నారి.. కొనసాగుతున్న సహాయక చర్యలు..!

చిన్నారిని కాపాడే చర్యల్లో భాగంగా జేసీబీతో బోరుబావి దగ్గర దాదాపు 50 అడుగుల మేర తవ్విన తర్వాత పైపును కోసి చిన్నారిని బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బోరుబావి నుంచి చిన్నారిని రక్షించే వీడియో కూడా బయటకు వచ్చింది.

by Venu

బోరు బావులు వేసి వాటిని వాడకుండా వదిలిపెట్టడం వల్ల అవి చిన్నారుల ప్రాణాలకు యమ పాషాలుగా మారుతున్న ఘటనలు తరచుగా చోటు చేసుకొంటున్నాయి.. ఇలాంటి సంఘటనే తాజాగా ఢిల్లీ (Delhi), కేషోపూర్ మండి (Keshopur Mandi) సమీపంలో జరిగింది.. స్థానికంగా ఆడుకొంటున్న ఓ చిన్నారి 40 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోవడం కలకలం సృష్టిస్తోంది.

కాగా విషయం తెలుసుకొన్న పోలీసులు వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌ (NDRF), అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న బృందాలు చిన్నారిని రక్షించే చర్యలు చేపట్టారు. బోర్‌వెల్‌కు సమాంతరంగా మరో బోరుబావి తవ్వేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఎన్డీఆర్‌ఎఫ్ బృందం తెలిపింది. అయితే బోర్‌వెల్‌ లోతు 40 అడుగులుండగా దానిలోపల నుంచి చిన్నారిని బయటకు తీయడం చాలా కష్టంగా మారినట్లు సమాచారం.

చిన్నారిని కాపాడే చర్యల్లో భాగంగా జేసీబీతో బోరుబావి దగ్గర దాదాపు 50 అడుగుల మేర తవ్విన తర్వాత పైపును కోసి చిన్నారిని బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బోరుబావి నుంచి చిన్నారిని రక్షించే వీడియో కూడా బయటకు వచ్చింది. బోర్‌వెల్‌లోని చిన్నారిని రక్షించేందుకు స్థానిక ప్రజలు NDRF బృందానికి ఎలా సహాయం చేస్తున్నారో ఇందులో చూడవచ్చు.

చిన్నారిని బయటకు తీయడానికి ముందుగా తాడును ఉపయోగించారు.. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. బోర్‌వెల్ లోపల చాలా చీకటిగా ఉంది. టార్చ్ ద్వారా చిన్నారిని చూసే ప్రయత్నం చేశారు. చిన్నారితో మాట్లాడేందుకు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. 2023 డిసెంబర్‌లో మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh), అలీరాజ్‌పూర్‌ (Alirajpur)లో ఇలాంటి సంఘటన చోటు చేసుకొంది.

సుమారు 20 అడుగుల లోతున్న బోరుబావిలో 5 ఏళ్ల చిన్నారి పడిపోయింది. రెస్క్యూ టీం రిస్క్ చేసి బయటకు తీసినా ప్రాణాలను కాపాడలేక పోయింది. దాదాపు నాలుగైదు గంటల పాటు ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. అయితే అప్పటికే అతను మరణించినట్లు తెలిసింది..

You may also like

Leave a Comment