మితిమీరిన వ్యాయమం చేయడమో, మారిన జీవనశైలి వల్ల స్ట్రెస్ కి గురికావడమో… కారణం ఏదైనా వయసుతో సంబంధం లేకుండా వ్యాయమం చేస్తూ జిమ్‌లోనే గుండెపోటు (Heart Attack) తో మరణిస్తున్న ఘటనలు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ (Uttara Pradesh) లోని ఘజియాబాద్ సిటీలోని ఓ జిమ్ (Gym) లో 19 ఏళ్ల యువకుడు వ్యాయామం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
బీహార్ రాష్ట్రానికి చెందిన సిద్దార్థ్ కుమార్ సింగ్ జిమ్‌లో ట్రెడ్ మిల్‌పై నడుస్తుండగా కార్డియాక్ అరెస్ట్ కావడంతో మరణించినట్లు పోలీసులు తెలిపారు. జిమ్ లోకి రావడం, ఆ యువకుడు ట్రెడ్ మిల్ పై నడుస్తుండటం, ఆ తర్వాత కుప్పకూలిపోవడం వంటి దౄశ్యాలు సీసీ కెమెరాలో రికార్డైయ్యాయి. ట్రెడ్ మిల్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సిద్ధార్థ్ దగ్గరకు వచ్చి జిమ్ లోని కొందరు యువకులు సహయపడటం కూడా ఆ దృశ్యాల్లో కనిపిస్తోంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయి మరణించడమే కాకుండా మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
మరో వైపు మితిమీరిన వ్యాయామం, మానసిక ఒత్తిళ్ల కారణంగానే జిమ్‌లో పనిచేస్తున్నప్పుడు గుండెపోటు, కార్డియాక్ అరెస్టుతో మరణిస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు.