పార్టీ మార్పుపై తనపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని బీజేపీ(Bjp) జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(Dk Aruna) స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. ఈ విషయంపై పత్రిక ప్రకటన విడుదల చేసిన డీకే అరుణ, తాను కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో చేరే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టారు.
కొందరు కాంగ్రెస్ నేతలు కావాలనే మైండ్ గేమ్ ఆడుతున్నారని డీకే అరుణ ఆరోపించారు. బీజేపీ జాతీయ నాయకత్వం తనను గుర్తించి జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పని చేయడానికి అదృష్టం ఉండాలని, ఇందులో పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు అరుణ తెలిపారు.
కనీసం తన స్పందన తీసుకోకుండా వార్తా కథనాలు రాయడం సరైన పద్ధతి కాదని డీకే అరుణ మండిపడ్డారు. తన రాజకీయ భవిష్యత్ నిర్ణయించాల్సిన హక్కు ఎవరు ఇచ్చారని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌లో తన చేరికపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనపై దుష్ప్రచారం చేసిన మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తానని డీకే అరుణ తెలిపారు.
బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు వెల్లడించారు. రాజీనామా చేస్తూనే బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన లాగే చాలా మంది నేతలు కూడా త్వరలోనే బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశముందన్నారు. ఈ నేపథ్యంలోనే తనపై వస్తున్న రూమర్స్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కొట్టిపారేశారు.