ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Scam) కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కి ఈడీ (ED) మళ్లీ సమన్లు పంపింది. మద్యం కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి జనవరి 18న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈడీ ఇప్పటికే మూడుసార్లు సమన్లు జారీ చేసినా ఢిల్లీ సీఎం విచారణకు హాజరుకాలేదు. దీంతో తమ ఎదుట హాజరు కావాలని దర్యాప్తు సంస్థ నాలుగోసారి ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్రం తమ నేతని ఇబ్బంది పెట్టాలని చూస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణల్ని ఖండించిన బీజేపీ (BJP).. సాధారణంగా మూడు సార్లు సమన్లు జారీ చేశాక ఈడీకి అరెస్ట్ చేసే అధికారం ఉంటుందని పేర్కొన్నారు.. ఈ క్రమంలో ఈడీ తీసుకునే చర్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కేజ్రీవాల్ ని అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు మళ్ళీ వినిపిస్తున్నాయి..
ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంకి సంబంధించిన కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia) జైల్లోనే ఉన్నారు. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ను అక్టోబర్‌లో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు అనేక మంది పార్టీ నేతలు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి వచ్చినా.. ఇంతవరకు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి..
ఇక మద్యం కుంభకోణంకు సంబంధించి రాజకీయ నాయకులు, లిక్కర్ వ్యాపారులు, పలు లిక్కర్ కంపెనీల నుంచి ఆప్ పార్టీ నేతలకు వందల కోట్ల రూపాయలు ముడుపులు అందాయనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా.. ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ అమలు చేసిందన్నదని జోరుగా ప్రచారం జరిగింది. కాగా ఈ అవినీతి, అక్రమాల్లో దక్షిణాదికి చెందిన పలువురు రాజకీయ నాయకులతో పాటు వారి సన్నిహితులకు కూడా సంబంధం ఉందని దర్యాప్తు సంస్థలు చార్జిషీట్లలో పేర్కొన్న విషయం తెలిసిందే..