తెలంగాణ (Telangana)లో సంచలనంగా మారిన నకిలీ పాస్ పోర్టు (Fake Passport) వ్యవహారంపై సీఐడీ (CID) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఈ కేసులో అధికారులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అనంతపురానికి (Anantapuram) చెందిన ఏజెంట్ తో పాటు.. మరొకరిని అదుపులోకి తీసుకొన్నారు. ఇప్పటికే నకిలీ పాస్ పోర్టులపై విదేశాలకు వెళ్లిన 92మందిని వెనక్కిరప్పించే చర్యలకు ఉపక్రమించారు.. ఈ క్రమంలో విదేశాంగ శాఖకు 92 మంది వివరాలను పంపించారు.
మరోవైపు ఈ కేసులో కీలక నిందితుడైన అబ్దుస్ సత్తార్ అల్ జవహరి.. విదేశీయులకు నీలోఫర్ ఆస్పత్రి పేరు మీద ఫేక్ ఆధార్, పాన్‌కార్డులు, నకిలీ బర్త్ సర్టిఫికేట్లను సృష్టించినట్లు వెల్లడించారు. వీరి నుంచి పాస్ పోర్టులు సహా పలు నకిలీ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకొన్నారు. అయితే ఎక్కువగా జగిత్యాల, ఫలక్‌నుమా చిరునామాలతో పాస్‌పోర్టులను తీసుకొన్న విషయాన్ని దర్యాప్తులో గుర్తించినట్లు అధికారులు తెలిపారు..
కాగా ఇప్పటి వరకూ ఈ కేసులో 12 మందిని సీఐడీ అరెస్ట్ చేయగా.. తాజా అరెస్టులతో ఈ సంఖ్య 14కి చేరింది. ఇక నకిలీ పాస్ పోర్టులతో కొందరు ఇప్పటికే విదేశాలకు వెళ్లగా.. మిగిలిన వారు దేశం దాటకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేస్తోంది. ఇప్పటి వరకూ అరెస్ట్ అయిన ఏజెంట్ల నుంచి సేకరించిన సమాచారంతో 35కి పైగా పాస్ పోర్టులను రద్దు చేయించేందుకు ప్రాంతీయ పాస్ పోర్టు ఆఫీస్ కు సీఐడీ అధికారులు సమాచారం అందించారు..
మరోవైపు పాస్ పోర్టుల జారీలో కీలక పాత్ర పోషించిన స్పెషల్ బ్రాంచ్ అధికారులపైన శాఖా పరమైన చర్యలు తీసుకొనేందుకు అధికారులు సిద్దం అవుతున్నట్టు తెలుస్తోంది. పాస్ పోర్టు జారీకి, ప్రక్రియ పూర్తయ్యేందుకు ఏజెంట్లు, అధికారులకు లంచాలు ముట్టచెప్పినట్టు సీఐడీ ఆధారాలు సేకరించింది. విజిటింగ్ వీసాలతో థాయిలాండ్, కెనడా, మలేషియా.. ఇరాక్, దుబాయ్, స్పెయిన్, ఫ్రాన్స్ వెళ్లినట్లు వెల్లడించింది.