వికారాబాద్ (Vikarabad) జిల్లా తాండూరు (Tandoor), మార్వాడీ బజార్లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది. ఓ కూలర్ల దుకాణాల్లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలు దుకాణాల్లోని వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయని సమాచారం. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. కాగా స్థానికుల సమాచారం మేరకు.. ఘటనా స్థలానికి చేరుకొన్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు..
ఈ ప్రమాదంలో దాదాపు రూ.లక్షల్లో ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు పేర్కొన్నారు. అయితే, ప్రమాదం షాట్ సర్య్కూట్ వల్ల జరిగిందా.. మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇకపోతే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో పలు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
మరోవైపు మంచిర్యాల (Mancherial) జిల్లా నస్పూర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సీసీ కార్నర్, రాజా ఎలక్ట్రికల్స్ పక్కన గల ట్రాన్స్ ఫార్మర్ లో షార్ట్ సర్క్యూట్ జరిగి, భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ట్రాన్స్ ఫార్మర్ పక్కన ఉన్న రెండు షాపులు పూర్తిగా దగ్ధం అయినట్లు సమాచారం.. ఈ ప్రమాదంలో దాదాపు 50 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
అదేవిధంగా కాలిపోయిన రెండు షాపుల్లో భారీగా మంటలు ఎగిసి పడడంతో చుట్టు పక్కల ఉన్న ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు..