Telugu News » Hyderabad : మజ్లిస్ కోటను బద్దలు కొట్టేందుకు.. ఓవైసీపై కొత్త ప్రయోగానికి దిగిన బీజేపీ..!

Hyderabad : మజ్లిస్ కోటను బద్దలు కొట్టేందుకు.. ఓవైసీపై కొత్త ప్రయోగానికి దిగిన బీజేపీ..!

బీజేపీ బలమైన, కొత్త ముఖాన్ని రంగంలోకి దించితే.. ఒవైసీ మీద గెలుపు సాధ్యమేనని అంచనా వేస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది.

by Venu

లోక్‌సభ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) కోటను బద్దలు కొట్టేందుకు బీజేపీ (BJP) కొత్త వ్యూహాలను రచిస్తోందా? అని ఆలోచించే వారికి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ (Hyderabad) ఎంపీ స్థానంలో బీజేపీ కొత్త అభ్యర్థిని ప్రకటించింది. పాతబస్తీలో మజ్లిస్ ను ఓడించచం కష్టమే కానీ అసాధ్యం కాదు. హిందూ ఓట్లన్నీ ఏకీకృతం అయితే.. చీలిపోకుండా చూసుకుంటే.. మజ్లిస్ కోటను బద్దలు కొట్టే అవకాశం ఉంది.

ఇదే ఆలోచనలో ఉన్న కాషాయం ముందు చూపుతో వ్యవహరిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడా బీజేపీ ఉనికిలేని రోజుల్లోనూ ఈ స్థానంలో ఎంఐఎంకి గట్టి ప్రత్యర్థిగా బీజేపీ నిలుస్తూ వస్తోంది. అయితే బీఆర్ఎస్ (BRS) ఓటమితో ఒవైసీ ప్రభావం ఎంతో కొంత తగ్గిందని, దీనికి తోడు కాంగ్రెస్ (Congress) కూడా ఎంఐఎంని గట్టిగా ఢీ కొట్టే ప్రయత్నం చేస్తోందని భావిస్తున్న బీజేపీ బలమైన, కొత్త ముఖాన్ని రంగంలోకి దించితే.. ఒవైసీ మీద గెలుపు సాధ్యమేనని అంచనా వేస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది.

దీనికి తోడు దేశ వ్యాప్తంగా మోడీ (Modi) చరిష్మా బలంగా పనిచేస్తోంది. ఈ సమయంలో ఒక్కసారి హైదరాబాద్ ఎంపీ సీటు గెలవాలని ఆ పార్టీ అధిష్ఠానం గట్టి పట్టుదలగా ఉందని అంటున్నారు.. అందుకే, బలమైన అభ్యర్థిని రంగంలోకి దించి విజయాన్ని సాధించాలని, తద్వారా అసదుద్దీన్, అతని పార్టీకి చెక్ పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. అదీగాక కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్ అభ్యర్థులుగా బరిలో నిలిస్తే.. భారీగా ముస్లింల ఓట్లలో చీలిక రావొచ్చని బీజేపీ అంచనా వేస్తోంది. అందుకే మాధవీలత వైపు మొగ్గినట్లుగా కనిపిస్తోంది.

ఈ క్రమంలో కొంపెల్ల మాధవీలత (Kompella Madhavilatha)ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. పాతబస్తీ మూలాలున్న మాధవీలత నుదుట రూపాయి కాసంత బొట్టు పెట్టుకొని కాస్త విచిత్రంగా ఉండే వేషధారణతో ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. విరించి హాస్పిటల్స్ ఎండీగా ఎక్కువ మంది గుర్తుంచుకొంటారు. ఎన్నారై అయిన ఈమె మధు సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ అనే ఐటీ సేవల సంస్థతో పాటు అమెరికాలో ‘క్యూ ఫండ్‌’ అనే ఫిన్‌‌కార్ప్‌‌నూ నడుపుతున్నారు.

మరోవైపు పాతబస్తీ కేంద్రంగా లోపాముద్రా ఫౌండేషన్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పేదల బస్తీల్లో హెల్త్ క్యాంపులు పెట్టి, ఉచితంగా మందులు ఇవ్వటం, టైలరింగ్ కేంద్రాలు పెట్టి మహిళలకు శిక్షణనిచ్చి, వారికి తగిన పనిని ట్రస్ట్ తరఫున కల్పించటంతో పాటు ప్రజ్ఞాపూర్‌ దగ్గర 4 లక్షల చదరపు అడుగుల్లో గోశాలను నిర్మించి దేశవాళీ ఆవులను పరిరక్షించుకోవాలనే ప్రచారం చేస్తున్నారు.

అంతే కాకుండా కొవిడ్ సమయంలో రోజూ ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్న వందలాది మందికి భోజనాన్ని పంపి స్థానికంగా మంచిపేరు తెచ్చుకొన్నారు. అటు సాధుసంతులతో సమావేశాలు పెట్టించటం, ధార్మిక ప్రవచనాలు ఏర్పాటు చేయించి పాతబస్తీ హిందూ ఓటర్లలో చైతన్యాన్ని కలిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో బాగా చదువుకొన్న, ఆర్థిక వనరులున్న, హిందీలో ప్రజలతో మమేకమయ్యే మహిళను బరిలో దింపితే త్రిముఖపోరులో సత్తా చాటవచ్చని భావించిన బీజేపీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

You may also like

Leave a Comment