హైదరాబాద్ (Hyderabad) అగ్ని ప్రమాదాలకు కేరాఫ్ గా మారుతున్నదనే అనుమానాలు కలుగుతున్నాయని అనుకొంటున్నారు.. గత సంవత్సరం ఊహించని రేంజ్ లో నగరంలో అగ్నిప్రమాదాలు చోటు చేసుకొన్న విషయం తెలిసిందే.. కనీసం కొత్త సంవత్సరంలో అయిన ఉపశమనం కలుగుతోందని భావిస్తున్న వారికి.. రెండవ రోజే అగ్ని ఆహ్వానం పలికింది..
ఉప్పల్ (Uppal) ప్రాంతంలో ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న, సీఎంఆర్ షాపింగ్ మాల్ (CMR Shopping Mall)లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం.. మంగళవారం రాత్రి సమయంలో ఒక్కసారిగా నాలుగంతస్తుల భవనంలోని ముందు భాగంలో మంటలు చెలరేగాయి. ఆ మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో భవనం అగ్నికీలల్లో చిక్కుకొంది. కాగా సమాచారం అందుకొన్న అగ్నిమాపక సిబ్బంది, ఐదు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తెచ్చారు..
అయితే మంటల ధాటికి భవనం పైకప్పు సీలింగ్ కుప్పకూలింది. కాగా ఈ ప్రమాదం జరగడానికి కొద్ది సేపు క్రితమే అందులో పనిచేసే సిబ్బంది, మాల్‌ను మూసివేసి వెళ్లిపోయారు. దీంతో పెద్ద ముప్పు తప్పిందనుకొంటున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు చర్లపల్లి, వెంకట్‌రెడ్డి నగర్ సమీపంలో ఉన్న మధుసూదన్‌రెడ్డి నగర్లో, అర్ధరాత్రి పేలుడు సంభవించింది. భారీ శబ్ధంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో చోటు చేసుకొన్న పేలుడు ధాటికి మ్యాన్ హోల్ మూత ఎగిరిపడింది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకొన్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. పరిశ్రమల వ్యర్థాలను డ్రైనేజీలోకి వదలడంతో ఈ పేలుడు సంభవించినట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.