– ఓవైపు శాఖల్లో మార్పులు
– ఇంకోవైపు ప్రజాకర్షక నిర్ణయాలు
– ప్రక్షాళన దిశగా రేవంత్ సర్కార్
– ఎక్కడా బీఆర్ఎస్ ప్రభావం లేకుండా అడుగులు
– కానీ, రానున్న రోజుల్లో ఆర్థిక కష్టాలు తప్పవా..?
– శ్వేతపత్రం విడుదల వెనుక మర్మమేంటి..?
– హామీల అమలు ఎలా ఉండబోతోంది..?
– ‘రాష్ట్ర’ ప్రత్యేక కథనం
ఆంధ్రా (Andhra Pradesh) లో పార్టీ కనుమరుగు అవుతుందని తెలిసినా.. తెలంగాణ (Telangana) ఇచ్చింది కాంగ్రెస్ (Congress) పార్టీ. కానీ, తెలంగాణలో అధికారం దక్కుతుందనుకుంటే.. దాదాపు పదేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇన్నాళ్లకు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరింది. సీఎంగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బాధ్యతలు అందుకున్నారు. అలాగే, 11 మంది మంత్రులుగా ప్రమాణం చేసి పనులు మొదలు పెట్టారు. అందివచ్చిన ఈ అవకాశాన్ని ఇలాగే కంటిన్యూ చేసేందుకు హస్తం నేతలు తెగ ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు.
గత రెండు పర్యాయాలు రాష్ట్రాన్ని పాలించింది బీఆర్ఎస్ (BRS). ఈ నేపథ్యంలో పాలనలో బీఆర్ఎస్ ప్రభావం లేకుండా జాగ్రత్త పడుతున్నారు రేవంత్. ఇన్నేళ్లలో గులాబీ పార్టీకి చెందిన వారు ప్రతి వ్యవస్థలో పాతుకుపోయి ఉండడంతో.. వారందర్నీ ఇప్పుడు మార్చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు కార్పొషన్ల చైర్మన్ల నియామకాలను రద్దు చేశారు. సలహాదారులపైనా వేటు వేశారు. అలాగే, గులాబీ నేతల సిఫారసుల మేరకు నియమితులైన అధికారులను బదిలీ చేస్తున్నారు. డిప్యూటేషన్ మీద ఇతర శాఖల్లో ఉన్న వారిని సొంత శాఖలకు పంపేస్తున్నారు.
ఓవైపు శాఖల్లో మార్పులకు శ్రీకారం చుడుతూనే.. ఇంకోవైపు ప్రజాకర్షక నిర్ణయాలతో సంచలనంగా మారారు రేవంత్ రెడ్డి. ప్రమాణ స్వీకారం రోజే ప్రగతి భవన్ కంచెలు తొలగించారు. ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చి ప్రజా దర్బార్ తో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. అయితే.. ప్రజా దర్బార్ ను ప్రజావాణిగా మారుస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 10 లోపు ప్రజా భవన్ కు చేరుకున్న వారికి వినతులు ఇచ్చేందుకు అవకాశం ఇచ్చారు.
ఇక, ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఏదైనా గుర్తింపు కార్డు చూయించి ఆడ పిల్లలు, మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్లకు కూడా ఈ అవకాశం కల్పించారు. అలాగే, రాజీవ్ ఆరోగ్యశ్రీలో భాగంగా చికిత్స కోసం రూ.10 లక్షలు ఖర్చు చేసే పథకాన్ని ప్రారంభించారు. గతంలో ఈ పథకం కింద 5 లక్షల రూపాయల వరకు మాత్రమే ఉచిత చికిత్స అందించేవారు. మరోవైపు, అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన తప్పులను తెలుసుకుంటున్నారు. ఇలా రేవంత్ రెడ్డి.. పాలనలో తనదైన ముద్ర వేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
అయితే.. రేవంత్ రెడ్డికి అసలు సినిమా ముందుందని అంటున్నారు రాజకీయ పండితులు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు ఏటా లక్ష కోట్లకు పైనే ఖర్చు అవువుతుందనే అంచనా ఉంది. బీఆర్ఎస్ పాలనలో మిగులు రాష్ట్రం కాస్తా.. ఐదున్నర లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. తెలంగాణ ఏర్పాటు సమయంలో బడ్జెటేతర రుణాలతోపాటు ప్రభుత్వం 76 వేల కోట్ల అప్పుల్లో ఉండగా.. పదేళ్లలో గులాబీ ప్రభుత్వం చేసిన 5.3 లక్షల కోట్ల అప్పులు తోడయ్యాయి. నేరుగా తీసుకున్నవే 3.59 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇక వివిధ కార్పొరేషన్లు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు 1.29 లక్షల కోట్ల వరకు ఉన్నాయి. కేవలం, వడ్డీల కోసమే కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి రాష్ట్ర ఖజానాకు ఎదురవుతున్నది. ఇలాంటి తరుణంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ హామీలు తలకు మించిన భారం అవుతాయని విశ్లేషకుల వాదన.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటవెంటనే నెరవేర్చడానికి ఆర్థిక పరిస్థితులు అనుకూలించే వాతావరణం లేదు. అందుకే, ప్రస్తుతానికి డబ్బు అధికంగా అవసరం లేని రెండు గ్యారెంటీలను అమలు చేశారని చెబుతున్నారు. గత ప్రభుత్వం పెద్ద మొత్తంలో చేసిన అప్పులు గుదిబండగా మారడంతో.. ఈ పరిస్థితిని ప్రజలకు వివరించి, దశలవారీగానే హామీల అమలు ఉంటుందని ప్రజలను ఒప్పించేందుకు, వారిని మానసికంగా సిద్ధం చేసేందుకే ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల నిర్ణయాన్ని కాంగ్రెస్ సర్కార్ ప్రకటించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పాలనపై తనదైన ముద్ర వేస్తున్న రేవంత్ సర్కార్ కు రానున్న రోజుల్లో గడ్డుకాలం తప్పదని హెచ్చరిస్తున్నారు విశ్లేషకులు.