శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukehnder) పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని తెలిపారు. పార్టీ మారుతున్నట్లైతే తన కొడుకు అమిత్ రెడ్డి (Amit Reddy)కి టికెట్ ఎందుకు అడుగుతానని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ (Nalgonda) జిల్లా బీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి తానే కారణమైతే ఖమ్మం, మహబూబ్ నగర్ , వరంగల్ జిల్లాలో ఓటమికి ఎవరు కారణమని ప్రశ్నించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) గాలి వ్యాపించిందని.. అందుకే బీఆర్ఎస్ (BRS) ఓడిపోయిందని అన్నారు.. అభివృద్ధి చేసిన మంత్రులు సైతం ఓడిపోయినట్లు గుర్తు చేశారు. ఖమ్మం, మహబూబ్ నగర్ ఎంపీ సీట్లతో పాటు నల్గొండ సీటు విషయంలో కూడా పోటీ ఉన్నట్లు గుత్తా పేర్కొన్నారు. బీఆర్ఎస్ అవకాశం ఇస్తే తన కొడుకు అమిత్ భువనగిరి లేదా నల్గొండ సీటు నుంచి లోక్ సభకు పోటీ చేస్తారని వెల్లడించారు.
కేంద్రం పరిధిలోకి కేఆర్ఎంబీ (KRMB) వెళ్తే తెలంగాణ Telangana)కు నష్టమేనని పేర్కొన్నారు. సాగు, తాగు నీళ్లకు ఇబ్బంది అవుతుందని అన్నారు.. కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్ లు కేఆర్ఎంబీ పరిధిలోకి పోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలిపారు. మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది.
నల్గొండ జిల్లా ఎంపీ స్థానంపై చర్చ జరిపినట్లు సమాచారం. గుత్తా పార్టీ మారుతున్నారనే ప్రచారం నేపథ్యంలో కేటీఆర్ గుత్తా ఇంటికి వెళ్లడం రాజకీయ వర్గాలలో చర్ఛనీయంశంగా మారింది. అయితే ఎన్నికల పోలింగ్ కంటే ముందు నుంచే మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మారి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ ప్రచారం మరింత ఎక్కువైంది. ఆయన తన తనయుడి కోసం తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతారన్న ప్రచారాన్ని ముందు నుంచీ ఖండిస్తున్నా ప్రచారం మాత్రం ఆగడం లేదు.