Telugu News » Hanuma Vihari : ఏపీ రాజకీయాలపై క్రికెటర్‌ హనుమ విహారి సంచలన వ్యాఖ్యలు..

Hanuma Vihari : ఏపీ రాజకీయాలపై క్రికెటర్‌ హనుమ విహారి సంచలన వ్యాఖ్యలు..

ఏపీ రాజకీయాల కారణంగా తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపిన హనుమ విహారి.. ఒక రాజకీయ నేత ఒత్తిడితో తన తప్పు ఏమీ లేకున్నప్పటికీ తనను కెప్టెన్ నుంచి వైదొలగమన్నారని ఆరోపించారు.

by Venu

ఏపీలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. టీమిండియా బ్యాటర్‌, తెలుగు క్రికెటర్‌ గాదె హనుమ విహారి (Hanuma Vihari) ఆంధ్రా క్రికెట్‌ జట్టును వీడనున్నట్లు వెల్లడించాడు. రంజీ ట్రోఫీ 2023-2024 క్వార్టర్‌ ఫైనల్‌లో ఓడిపోయి.. టోర్నీ నుంచి ఆంధ్ర జట్టు నిష్క్రమించిన అనంతరం హనుమ విహారి తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఇక్కడి క్రికెట్‌ అసోసియేషన్‌ తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని పేర్కొన్న ఆయన.. ఇకపై ఆ జట్టు తరఫున ఆడబోనని షాకిచ్చారు. ఇందుకు గల కారణాన్ని సైతం వివరించారు.

ఏపీ రాజకీయాల కారణంగా తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపిన హనుమ విహారి.. ఒక రాజకీయ నేత ఒత్తిడితో తన తప్పు ఏమీ లేకున్నప్పటికీ తనను కెప్టెన్ నుంచి వైదొలగమన్నారని ఆరోపించారు. హనుమ విహారి నిర్ణయం నేపథ్యంలో రాష్ట్రంలో తాజా రాజకీయాలపై టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) ట్విట్టర్ వేదికగా స్పందించారు. వైఎస్సార్సీపీ ప్రతీకార రాజకీయాలకు ఆంధ్ర క్రికెట్ సంఘం కూడా లొంగిపోవడం సిగ్గుచేటని అన్నారు.

ఇదే సమయంలో హనుమ విహారికి అండగా తాము ఉంటామని పేర్కొన్న చంద్రబాబు హనుమా.. మీరు దృఢంగా ఉండండి ఆట పట్ల మీ చిత్తశుద్ధి నిబద్ధత చాలా గొప్పది అని పేర్కొన్నారు. మరోవైపు ఈ వివాదంపై ఏపీ పీసీసీ (PCC) అధ్యక్షురాలు షర్మిల (Sharmila) స్పందించారు. ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకేమన్నా ఉంటుందా అని మండిపడ్డారు. అన్నింటిలో నీచ రాజకీయాలు చేస్తున్న వైకాపా వాళ్లు, ఇప్పుడు క్రీడలపై కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (PawanKalyan) సైతం ఈ అంశంపై మండిపడ్డారు..

ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌కు భారత క్రికెటర్ కంటే.. వైకాపా నాయకుడే ముఖ్యమా అని నిలదీశారు. ఆటగాళ్లను గౌరవించడం తెలిసిన స్టేట్ క్రికెట్‌ అసోసియేషన్‌తో అతడు వచ్చే ఏడాది మళ్లీ ఆంధ్రా తరఫున ఆడతాడని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు గాదె హనుమ విహారి వివాదం నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కుట్టీ స్టోరీస్ విత్ యాష్ ‘విహారి గారూ’ మీరు రెడీ ఉన్నారా? అని పోస్టు చేశారు. ఈ విషయాలపై తన యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతావా? అని విహారిని అడిగాడు. దీనికి స్పందించిన విహారి.. మీరు ఎప్పుడు అంటే అప్పుడని బదులిచ్చారు..

You may also like

Leave a Comment