రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి భారీగా స్పందన వస్తున్న విషయం తెలిసిందే.. ఆరు గ్యారెంటీలకు అప్లై చేసుకునేందుకు జనం పంచాయతీ కార్యాలయాల వద్దకు భారీగా వచ్చారు.. అయితే ఈ అంశంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు.. ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్స్ స్వీకరించవలసింది పోయి.. ఇలా మ్యాన్యువల్ గా దరఖాస్తులను తీసుకోవడం.. ఇందుకోసం జనాన్ని రోడ్డెక్కించడం ఎంటనే వాదనలు వినిపిస్తున్నాయి..
మరోవైపు సందట్లో సడేమియాలా ఎవరో ఒక ఆకతాయి ఆరు గ్యారెంటీల అప్లికేషన్స్ లో, శివుడి పేరిట దరఖాస్తు చేసినట్టు అధికారులు గుర్తించారు.. హనుమకొండ (Hanumakonda) జిల్లా భీమదేవరపల్లి (Bhimadevarapalli) మండలం ముత్తారం (Muttaram) గ్రామంలో ఈ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఏకంగా పరమ శివుడి పేరిట దరఖాస్తు ప్రజా పాలనలో అధికారులకు అందింది.
అందులో అర్జీదారు శివుడు కాగా, కుంటుంబ వివరాల కాలమ్లో భార్య పార్వతి, కుమారుల పేర్లు కుమార స్వామి, వినాయకుడు అని రాసి ఉంది. ఇది ఎవరో కావాలనే చేసినట్టు క్షుణంగా అర్థం అవుతోంది. అయితే అప్లికేషన్స్ స్వీకరణ నామమాత్రంగా జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఈ ఘటన నిజమని నిరూపించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.. దరఖాస్తులను పరిశీలించి తీసుకొంటే.. ఇలా చేసిన వారు దొరికేవారు కదా అనుకొంటున్నారు..
మరోవైపు దరఖాస్తు ఫారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. మరికొందరైతే హిందూ దేవతలను ఇలా నవ్వులపాలు చేయడం సరికాదని మండిపడుతున్నారు.. ఇది ఖచ్చితంగా కావాలని చేసిన పనిగా పేర్కొంటున్నారు..