క్రికెటర్లు హార్దిక్ (Hardik Pandya), కృనాల్ పాండ్య తమ సమీప బంధువు చేతిలోనే మోసపోయారు. వరుసకు సోదరుడయ్యే వైభవ్ పాండ్య (Vaibhav Pandya) వీరికి భాగస్వామ్య వ్యాపారంలో దాదాపు రూ.4.3కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టాడు. దీనిపై ఫిర్యాదు చేయడంతో ముంబై పోలీసు ఆర్థిక నేరాల విభాగం అధికారులు వైభవ్‌ను అరెస్టు చేశారు.
వైభవ్, హార్దిక్ సొంత సోదరుడు కృనాల్ పాండ్య కలిసి 2021లో ఓ బిజినెస్ పెట్టారు. అందులో వైభవు 20శాతం వాటా ఉంది. అయితే, అతడు భాగస్వాములకు తెలియకుండా సొంతంగా ఇదే తరహా వ్యాపారం మొదలుపెట్టారు. కొత్త బిజినెస్ కోసం పాత వ్యాపారం నుంచి రూ.4.3కోట్ల నిధులను మళ్లించారట. దీంతో అతడిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదయ్యాయి.
ఇందులో హార్దిక్, కృనాల్‌కు 40శాతం చొప్పున పెట్టుబడులున్నాయి. మిగతా 20శాతం వాటా ఉన్న వైభవ్ ఈ బిజినెస్ రోజువారీ కార్యకలాపాలను చూసుకున్నాడు. లాభాలను కూడా ఇదే నిష్పత్తిలో పంచుకున్నారు. అయితే, పాండ్య సోదరులకు తెలియకుండా కొద్ది రోజుల క్రితం వైభవ్ సొంతంగా మరో పాలిమర్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. దీంతో గతంలో భాగస్వామ్యంతో పెట్టిన బిజినెస్‌కు లాభాలు తగ్గి రూ.3కోట్ల మేర నష్టం వాటిల్లింది.
అదే సమయంలో వైభవ్ రహస్యంగా తన లాభాల వాటాను 20శాతం నుంచి 33 శాతానికి పెంచుకున్నాడు. సంస్థ అకౌంట్ నుంచి భారీ మొత్తంలో డబ్బును తన ఖాతాకు మళ్లించుకున్నాడు. అలా మొత్తంగా దాదాపు రూ.4.3 కోట్ల మేర హార్దిక్ సోదరులను మోసం చేశాడు. ఈ విషయంపై హార్దక్, కృనాల్ ఆరా తీయగా పరువు తీస్తానంటూ బెదిరింపులకు దిగినట్లు సమాచారం. దీంతో హార్దిక్, కృనాల్ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు వైభవ్‌ను అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.