మాజీ మంత్రి, కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిరామ జోగయ్య (Harirama Jogaiah).. ఇటీవల లేఖాస్త్రాలతో నిత్యం వార్తల్లోకెక్కుతున్నారు. రాష్ట్ర ప్రజానీకానికి ఓసారి, కాపు సామాజిక వర్గానికి మరోసారి, ప్రత్యేకంగా పవన్ కల్యాణ్ కు ఇంకోసారి ఆయన బహిరంగ లేఖలు రాస్తు చర్చల్లో నిలుస్తున్నారు.. ఒక్కోసారి హరిరామ జోగయ్య రాసే లేఖలు పీక్ స్టేజ్ కి వెళ్ళి.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కి ఇబ్బందింగా మారిన సందర్భాలు సైతం ఉన్నాయి..
మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ.. టీడీపీ.. జనసేన చురుకుగా వ్యవహరిస్తున్నాయి.. వైసీపీపై ఆరోపణలతో ముందుకి వెళ్తుండగా.. అంతే ధీటుగా వైసీపీ సమాధానాలు చెబుతోన్న సంగతి తెలిసిందే.. ఈ సమయంలో హరిరామ జోగయ్య మరో లేఖను సంధించారు.. ఈ సారి రాసిన బహిరంగ లేఖలో కీలక అంశాలను పవన్ దృష్టికి తీసుకెళ్లారు..
ఉమ్మడి మ్యానిఫెస్టోలో పలు అంశాలు పరిశీలించాలంటూ సూచించిన హరిరామ జోగయ్య.. సీఎం వైఎస్ జగన్ను (YS Jagan) ఓడించాలంటే వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకంటే మెరుగైన పథకాలు అమలకు శ్రీకారం చూట్టాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ (Congress) పార్టీ ప్రభుత్వ హయాంలో పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు, ఇతర ఛార్జీల నుంచి ఉపసమనం కలిగించేందుకు ప్రతి కుటుంబానికి రెండువేలు అందేలా చూడాలని లేఖలో పేర్కొన్నారు..
నెలకు రూ. నాలుగు వేలు, వృద్ధాప్య పెన్షన్ కింద ఇవ్వాలని హరిరామ జోగయ్య సూచించారు. అయితే తెల్ల రేషన్ కార్డు ఆధారంగా గుర్తించి అర్హత ఉన్నవారికి అందేలా చేయాలన్నారు. తెల్లకార్డు కలిగిన కుటుంబాల్లో 18 ఏళ్లు దాటిన విద్యార్ధిని, విద్యార్ధులకు ఎలక్ట్రికల్ స్కూటీలు ఉచితంగా అందించాలని.. విద్యుత్ బిల్లులపై సైతం 20 శాతం సబ్సిడీ ఇవ్వాలంటూ హరిరామ జోగయ్య తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు..