సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాలమూరు (Palamuru)లో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి.. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ విషయంలో స్పందించారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అలా మాట్లాడటం సరికాదని సూచించారు.. ప్రభుత్వం పై విమర్శలకు దిగారు.. అంతగా తిట్టాలని ఉంటే రేవంత్.. తన గురువు చంద్రబాబును తిట్టాలి. కాంగ్రెస్ చేసిన మోసాలను నిందించాలని తెలిపారు..
మహబూబ్ నగర్ వెనుకబాటు తనానికి నాటి టీడీపీ (TDP), కాంగ్రెస్ (Congress) పాలనలే కారణమని ఆరోపించారు. చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ లోపాలు, పాలమూరు పాలిట శాపాలుగా మారాయని విమర్శించారు.. సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు (Harish Rao).. పాలమూరు వలసలకు కారణం ఆ రెండు పార్టీలేనన్నారు. గత ప్రభుత్వాలు ప్రాజెక్టుల పేర్లు మార్చాయి తప్ప పనులు పూర్తి చేయలేదని విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టును రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన కేసీఆర్ ను తిట్టడం అవివేకమని ద్వజమెత్తారు.
పేగులు మెడలో వేసుకొని రాక్షసులు తిరుగాతరని సీఎం అనడం సరికాదన్నారు.. పడిగట్టు పదాలు, పరుష పదజాలంతో పరిపాలన సాగదని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నట్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదు. చిల్లర మల్లర భాష మాట్లాడి పదవి గౌరవం తగ్గించుకోవద్దని హితవు పలికారు. నా ఎత్తు గురించి ఆయన మాట్లాడుతరు. నేను అలా మాట్లాడి విలువ తగ్గించుకోను. కుసంస్కారాంగా మాట్లాడటం వల్ల విలువ దిగజారుతుందని హరీష్ రావు తెలిపారు.
మరోవైపు కేసీఆర్ కిట్లు తెస్తే, రేవంత్ రెడ్డి తిట్లతో పోటీ పడుతున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహబూబ్ నగర్ ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో ఎన్ని బతుకులు బాగుపడ్డాయి. ఎన్ని కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. ఎన్ని రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పడ్డాయో చూస్తే కేసీఆర్ ఏం చేశారో…రేవంత్ రెడ్డికి అర్థం అవుతుందని తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని ప్రజలను దృష్టి మరల్చే యత్నం సరికాదన్న హరీష్ రావు.. సభలలో మంచి వాదనలు వినిపించండని సూచించారు. ఓట్లు సీట్లే కాదు ముఖ్యం.. నిజాయతీ కూడా గొప్ప లక్షణం అని రేవంత్ రెడ్డి కి హితవు పలికారు.