ఎన్నికల వేళ(Telangana assembly elections) రాజకీయ పార్టీలు, నాయకులు, అభ్యర్థులు తాయిళాలను ఓటర్లకు ఎరగా వేసేందుకు సిద్ధమవుతున్నారు. భారీగా డబ్బు, మద్యం, డ్రగ్స్ తరలిస్తున్నారు. దీంతో పోలీసులు కూడా అదేస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తుండటంతో భారీగా నోట్ల కట్టలు(Money) , బంగారం పట్టుబడుతున్నాయి. తాజాగా విశాఖ(Vishakapatnam)లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
విశాఖలో నోట్ల కట్టలు కలకలం రేపాయి. అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న భారీగా హవాలమనీ పట్టుబడింది. ఎయిర్ పోర్ట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎన్ఏడీ వద్ద ఓ వాహనంలో వాషింగ్ మిషన్లు తరలిస్తుండగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా సుమారు రూ.కోటి 30లక్షల రూపాయలు నగదు ఎలాంటి పత్రాలు లేకుండా పట్టుబడింది. విశాఖ నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ తరలిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఈ మేరకు పోలీసులు సీఆర్పీసీ 41, 102 సెక్షన్ల కంద కేసు నమోదు చేశారు. నగదుతో పాటు వాహనాన్ని సీజ్ చేసి నగదు తరలిస్తున్న వారిని కోర్టులో హాజరుపరిచారు. నోట్ల కట్టలు ఎవరివనే విషయం కానీ, నగదుకు సంబంధించిన ఇతరత్రా ఆధారాలు కానీ చూపించలేదు. దీంతో నగదుతో పాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆటోను సీజ్ చేసి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మిగతా వివరాలను పోలీసులు వెల్లడించలేదు. నగరంలోని ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ నుంచి ఈ నోట్ల కట్టలను తరలిస్తున్నట్లు సమాచారం.
అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 3న నోటిఫికేషన్ రానున్నది. ఈ నెల 9 నుంచే ఎన్నికల కోడ్ అమలవుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా భారీగా నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, వెండి, వజ్రాల ఆభరణాలు, ఓటర్లను ప్రభావితం చేసే ఇతర విలువైన వస్తువులు పట్టుబడుతున్నాయి. 2018 ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత వచ్చిన గణాంకాల ప్రకారం పట్టుబడిన నగదు, మద్యం, ఇతర సామగ్రి విలువ సుమారు రూ.137 కోట్లు మాత్రమే. కానీ, తాజాగా ఆ రికార్డును ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే చెరిపివేసింది.