నాలుగు రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హీరోయిన్ అరుంధతి నాయర్ (Arundati Nair) పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చి తన సోదరుడి బైకు మీద తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో కోవలం బైపాస్ రోడ్డులో గుర్తు తెలియని వాహనం (Road Accident) వీరిని వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటన రాత్రివేళలో చోటుచేసుకుంది. ఆ సమయంలో వీరికి ఎవరూ సాయం చేయలేదని సమాచారం.
కొన్ని గంటల తర్వాత అటుగా వెళ్లే వాహనదారులు రోడ్డుపై పడి ఉన్నది నటి అరుంధతిగా గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో అరుంధతి తలకు బలమైన గాయం కావడంతో మెదడులో రక్తం గడ్డ కట్టింది. పక్కటెముకలు విరిగిపోయాయని వైద్యులు వెల్లడించారు.
అయితే, వైద్యానికి చాలా ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పంతో అరుంధతి స్నేహితురాలు రెమ్యా ఫండ్ రైజింగ్ చేశారు. ఆమె సోదరి ఆర్తి కూడా సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్టు చేసి ఫండ్ రైజ్ చేశారు. తమ సోదరి పరిస్థితి క్రిటికల్‌గా ఉందని, సాయం చేయాలని కోరారు. అయితే, కొందరు ఇదంతా పెద్ద స్కాం అని తమను ట్రోల్ చేస్తున్నట్లు ఆమె వాపోయారు.
ఇక అరుంధతి నాయర్ తమిళం, మళయాళంలో ఎక్కువగా సినిమాలు చేసింది. సాయం కోసం తమిళ నిర్మాతల సంఘం ‘నడిగర్’లో సంప్రదించగా ఎవరూ ముందుకు రావడం లేదని అరుంధతి ఫ్రెండ్, ఆమె సోదరి ఆవేదన వ్యక్తంచేశారు. మళయాళం ఇండస్డ్రీకి చెందిన ఈ నటి తమిళ యాక్టర్ విజయ్ అంటోనీతో కలిసి తమిళంలో ‘సైతాన్’.. తెలుగులో ‘బేతాళుడు’గా విడుదలైంది. కాగా, తమ అభిమాన నటి త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.