Telugu News » High Court : కేసీఆర్ కు హైకోర్టు షాక్.. కౌంటర్ దాఖలుకు ఆదేశాలు!

High Court : కేసీఆర్ కు హైకోర్టు షాక్.. కౌంటర్ దాఖలుకు ఆదేశాలు!

ఈ కేసులో 16 నెలలుగా ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయడం లేదని తెలిపారు.

by admin
High_Court_of_Telangana_in_Hyderabad

– బీఆర్ఎస్ ఆఫీసుల స్థల కేటాయింపుల కేసు
– హైకోర్టులో విచారణ
– ఎకరా వంద కోట్లకు అమ్ముడవుతుంటే..
– గజం వంద రూపాయలకే ఎలా?
– పిటిషనర్ న్యాయవాది ప్రశ్న
– కౌంటర్ దాఖలు చేయాలన్న న్యాయస్థానం
– ఎకరాకు 100 కోట్ల బెంచ్ మార్క్ తీర్పు..
– గుర్తు చేస్తూ కీలక వ్యాఖ్యలు
– విచారణ 3 వారాలకు వాయిదా

బీఆర్ఎస్ (BRS) ఆఫీసులకు స్థల కేటాయింపుల కేసుపై హైకోర్టు (High Court) లో విచారణ జరిగింది. ఈ కేసులో సీఎం కేసీఆర్ (CM KCR) ఐదో ప్రతివాదిగా ఉన్నారు. కోకాపేటలో రూ.100 కోట్లకు ఎకరం జాగా అమ్ముతున్న ప్రభుత్వం.. అధికార పార్టీకి మాత్రం చదరపు గజం కేవలం రూ.100 కే కేటాయించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు.

High Court Suspended Govt GO on Telangana VRAs Adjustment

మార్కెట్ ధరలతో పొంతన లేకుండా పార్టీ ఆఫీసులకు కారు చౌకగా భూముల్ని కేటాయించడాన్ని సవాలు చేస్తూ గతేడాది దాఖలైన పిటిషన్‌ పై చీఫ్ జస్టిస్ అలోక్, జస్టిస్ వినోద్ కుమార్‌ లతో కూడిన బెంచ్ బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైదరాబాద్ తో పాటు జిల్లా కేంద్రాల్లో కలిసి మొత్తం 34 ఎకరాల స్థలాన్ని పార్టీ ఆఫీసుల కోసం తీసుకున్నారని తెలిపారు చిక్కుడు ప్రభాకర్. ఆ స్థలాల్లో ఆఫీసులు కూడా నిర్మించారని న్యాయస్థానానికి విన్నవించారు.

ఈ కేసులో 16 నెలలుగా ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయడం లేదని తెలిపారు. వాదనలు అనంతరం కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కౌంటర్ అఫిడవిట్‌ ను ప్రభుత్వం లేదా బీఆర్ఎస్ పార్టీ అధినేతగా కేసీఆర్ దాఖలు చేయకపోయినా మార్కెట్‌ లో అమ్ముడుపోతున్న ధరకే కేటాయించాల్సిందిగా ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుందని అభిప్రాయపడింది. కేసు విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

హైదరాబాద్ సహా మొత్తం 33 జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులకు గజం రూ.100 చొప్పున ప్రభుత్వం కేటాయించగా కొన్ని జిల్లాల్లో ఆఫీసుల నిర్మాణం పూర్తయ్యి ప్రారంభోత్సవాలు జరిగాయి. ఇంకొన్ని సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన ఉత్తర్వులను ప్రస్తావిస్తూ తెలంగాణలో బీఆర్ఎస్ ఆఫీసులకు కూడా రూ.100 కోట్ల చొప్పున ఎకరానికి ధర చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని బెంచ్ మౌఖికంగా అభిప్రాయపడిందని.. పిటిషనర్ తరఫు న్యాయవాది అంటున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణ సందర్భంగా ఎలాంటి అంశాలు వాదనలకు వస్తాయన్నది ఇంట్రస్టింగ్ గా మారింది.

You may also like

Leave a Comment