Telugu News » Malkajgiri MLA : టార్గెట్ మల్లారెడ్డి.. బుల్డోజర్ సర్కార్..!

Malkajgiri MLA : టార్గెట్ మల్లారెడ్డి.. బుల్డోజర్ సర్కార్..!

ఈమధ్య మల్లారెడ్డి కాలేజీ కోసం వేసిన రోడ్డును కూడా ఇలాగే కూల్చివేశారు. ఇప్పుడు ఆయన అల్లుడు రాజశేఖర్‌ రెడ్డి కాలేజీ భవనాలను కూల్చివేశారు. మేడ్చల్‌, దుండిగల్ ప్రాంతంలోని బఫర్‌ జోన్ లో ఈ నిర్మాణాలు ఉన్నాయి.

by Venu
High Tension At Malla Reddy College

– అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్ ప్రయోగం
– యోగి బాటలోనే రేవంత్ రెడ్డి
– మొన్న మల్లారెడ్డి.. ఇప్పుడు అల్లుడు రాజశేఖర్ రెడ్డి
– చెరువు భూమి కబ్జా
– బుల్డోజర్ తో కూల్చేసిన అధికారులు
– రేవంత్‌ సలహాదారు నరేందర్ రెడ్డితో మల్లారెడ్డి భేటీ

మేడ్చల్ ఎమ్యెల్యే మాల్లారెడ్డి లీలలు ఎరగని వారుండరు. తాజాగా ఆయన అల్లుడు మల్కాజ్‌ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కబ్జా బాగోతం వెలుగుచూసింది. దుండిగల్ చిన్నదామర చెరువు భూమి కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. దీంతో నిర్మాణాలను కూల్చి వేసేందుకు అధికారులు వెళ్లారు. ఈ నేపథ్యంలో వారికి చేదు అనుభవం ఎదురైంది. కాలేజీ ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధికారులను అడ్డుకొన్నారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకొంది. ఇదిలా ఉండగా అక్రమ నిర్మాణాల కూల్చివేత సమాచారం అందుకొన్న ఎమ్యెల్సీ శంభిపూర్ రాజు, ఎమ్యెల్యేలు మాల్లారెడ్డి, వివేకానంద, మాధవరం కృష్ణారావు తదితరులు సంఘటన స్థలానికి చేరుకొని అధికారులను నిలదీసే ప్రయత్నం చేసినట్టు సమాచారం.

High Tension At Malla Reddy College

పోలీసులు ఆందోళనకారులను హెచ్చరించడంతో సిబ్బంది భవనాలను కూల్చివేత కొనసాగించారు. చెరువు భూమిని ఆక్రమించి నిర్మాణాలను చేపట్టినట్టు రెవిన్యూ అధికారులు వివరించారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కాలేజీపై చర్యలు తీసుకోడానికి అధికారులు సాహసించలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలను చేపట్టిన వారిపై కఠిన చర్యలు ప్రారంభించారు.

ఈమధ్య మల్లారెడ్డి కాలేజీ కోసం వేసిన రోడ్డును కూడా ఇలాగే కూల్చివేశారు. ఇప్పుడు ఆయన అల్లుడు రాజశేఖర్‌ రెడ్డి కాలేజీ భవనాలను కూల్చివేశారు. మేడ్చల్‌, దుండిగల్ ప్రాంతంలోని బఫర్‌ జోన్ లో ఈ నిర్మాణాలు ఉన్నాయి. మల్లారెడ్డికి చెందిన కాలేజీల కూల్చివేత నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సలహాదారు నరేందర్ రెడ్డితో మల్లారెడ్డి భేటీ అయ్యారు. అల్లుడు రాజశేఖర్‌ రెడ్డితో కలిసి కార్యాలయానికి వచ్చిన  మల్లారెడ్డి చర్చలు జరిపారు. రెండు గంటలకు పైగా ఈ భేటీ కొనసాగింది. అంతకుముందు ఇదంతా రాజ‌కీయ కుట్ర‌లో భాగ‌మ‌ని.. త‌ను కాంగ్రెస్‌లో చేరిపోతే.. ఇవ‌న్నీ ఆగిపోయాతా? అంటూ మ‌ల్లారెడ్డి ఫైర్ అయ్యారు. మరోవైపు, ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా అల్వాల్ లో జరిగిన ఆందోళనకు సంబంధించిన మర్రి రాజశేఖర్ రెడ్డిపై కేసు ఫైల్ అయింది.

You may also like

Leave a Comment