కొద్దిరోజుల క్రితం ప్రశ్నాపత్రాల లీకేజ్ (Exam Paper Leak)తో అభాసుపాలైంది టీఎస్పీఎస్సీ (TSPSC). తీగ లాగితే డొంకంతా కదిలిన తీరుగా అందులో పని చేసే ఇద్దరు వ్యక్తుల నుంచి కూపీ లాగగా పెద్ద చైన్ లింక్ వెలుగుచూసింది. ఇందులో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. కానీ, బీఆర్ఎస్ (BRS) వర్గాలు దీన్ని ఖండిస్తూ వస్తున్నాయి. టీఎస్పీఎస్సీ పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తోంది. ఇప్పటికే కొన్ని జరిపింది. అయితే.. గ్రూప్- 2 (Group 2)వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
గురువారం టీఎస్పీఎస్సీ ఆఫీస్ దగ్గరకు వేలాదిగా తరలివచ్చారు అభ్యర్థులు. వీరికి ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రూప్- 2 వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ టీఎస్పీఎస్సీ దగ్గర వేలాది మంది అభ్యర్థులు బైఠాయించారు. వరుస ఎగ్జామ్స్ నేపథ్యంలో తమకి ప్రిపరేషన్ కి సమయం లేదని వాయిదా వేయాలన్నారు. ఈనెల 3 నుంచి 22 వరకు గురుకుల, జేఎల్, డీఎల్ పరీక్షలు జరుతున్నాయి. దీంతో గ్రూప్స్ కి సమయం లేదని వాపోతున్నారు.
వచ్చే నెలలో టెట్ పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో గ్రూప్ -2 వాయిదా వేయాలని విద్యార్థి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ స్పందించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఒక్కసారిగా ఓయూ జేఏసీ నేతలు, అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఆఫీస్ వద్దకు చేరుకోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి వాహనాల్లో తరలించారు.
ఈ ధర్నాలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, ఇతర నేతలు పాల్గొన్నారు. వేలాది మంది అభ్యర్థులు అక్కడ బైఠాయించడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. వారందరినీ పక్కకు పంపించి పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.