హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సీఎం సుఖ్విందర్ సింగ్(CM Sukhwinder Singh resigns) రాజీనామా చేస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ పంపారు. అయితే గవర్నర్కు మాత్రం ఇంకా లేఖను పంపలేదు. కాగా, రాజ్యసభ ఎన్నికల్లో సొంత పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా బీజేపీ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ వేశారు.
దీంతో హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో సంక్షోభం నెలకొంది. సాయంత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమై కొత్త సీఎంను ఎన్నుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమితో కేంద్రంలో పాగా వేద్దామని కలలుగన్న కాంగ్రెస్ కలలు ఆవిరయ్యాయి. బీజేపీ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో నిమగ్నమైంది.
ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 68. అందులో కాంగ్రెస్కు 40మంది, బీజేపీకి 25మంది, ముగ్గురు స్వతంత్ర సభ్యులు ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు స్వతంత్రులు కూడా బీజేపీకి ఓటు వేయడంతో బీజేపీ బలం ఒక్కసారిగా 34కు చేరింది. ఆరుగురు సభ్యులను కోల్పోవడంతో కాంగ్రెస్ బలం ఇప్పుడు 34కు పడిపోయింది.
ప్రభుత్వ ఏర్పాటుకు ఒకే ఒక్క సభ్యుడి మద్దతును కూడగట్టడం బీజేపీకి పెద్ద కష్టమేమీ కానిపని అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో త్వరలోనే హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ పాగా వేయడం ఖాయంగానే కనిపిస్తోంది. మరోవైపు, మంత్రి పదవికి కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రమాదిత్య సింగ్ రాజీనామా చేశారు. బుధవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా వెంటనే బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.
అసెంబ్లీ నుంచి 15 మంది విపక్ష ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యల కారణంగా వారిని స్పెండ్ చేసినట్లు స్పీకర్ తెలిపారు. బీజేపీ నాయకుడు హర్ష్ మహాజన్ మాట్లాడుతూ.. అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అతి త్వరలోనే ప్రభుత్వ మార్పు జరగబోతోందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని, మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని తెలిపారు.