నగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకొంది. వీధికుక్కల (Street Dogs) బారినపడి మరో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మాటలు కూడా సరిగ్గా రాని చిన్నారికి అప్పుడే నూరేళ్ళు నిండటంతో తల్లిదండ్రుల రోదన చూసిన వారిన కలిచివేస్తోంది. హైదరాబాద్ (Hyderabad)లో జరిగిన ఈ హృదయ విదారక ఘటన వివరాలు చూస్తే..
ఏడాది వయసున్న చిన్నారిని గుడిసెలో పడుకోబెట్టి నిద్రలోకి జారుకొన్న తల్లిదండ్రులు, ఉదయాన్నే లేచి చూసే సరికి తమ కుమారుడు కనిపించలేదు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఆ చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకుండా పోయింది. చివరికి అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలను పరీక్షించగా… గుడిసెలో చొరబడ్డ వీధికుక్కలు.. తల్లిదండ్రుల చెంత నిద్రిస్తున్న చిన్నారిని నోట కరుచుకొని బయటికి ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.
మరోవైపు కుక్కల దాడిలో ఛిద్రమైన చిన్నారి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. దిక్కులు పిక్కటిల్లేలా ఆర్తనాదాలు చేశారు. కాగా శంషాబాద్ (Shamshabad) సమీపంలో, సామ ఎన్క్లేవ్ (Sama Enclave)వద్ద ఈ ఘటన చోటు చేసుకొంది. సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. అయితే మరణించిన చిన్నారి నాగరాజు తల్లిదండ్రుల స్వస్థలం దేవరకద్ర, నాగారం గ్రామం అని తెలుస్తోంది.
వీరు బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. చిన్నారి తండ్రి సూర్య కుమార్ దినసరి కూలీగా పనిచేస్తూ భార్య పిల్లలను పోషిస్తున్నాడని సమాచారం. ఇప్పటికే అంబర్పేటలో వీధికుక్కలు ఐదేళ్ల బాలుడిపై దాడి చేసి చంపేసిన ఘటన నేటికీ నగరవాసుల కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. తాజాగా శంషాబాద్లో చోటు చేసుకున్న ఘటన కూడా అలాంటిదే. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ విషయంలో అధికారుల త్వరగా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు..